బాధాకరం.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు

నేటి తరం యువత అస్సలు ఒత్తిడిని ఎదుర్కోలేకపోతోంది. ఏమాత్రం ఇబ్బంది వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సమస్య చిన్నదా పెద్దదా.. ఎలా పరిష్కరించాలనేది ఆలోచించడం లేదు. కనీసం తల్లిదండ్రులతో కూర్చొని చర్చించాలనే ఆలోచన కూడా చేయడం…

నేటి తరం యువత అస్సలు ఒత్తిడిని ఎదుర్కోలేకపోతోంది. ఏమాత్రం ఇబ్బంది వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సమస్య చిన్నదా పెద్దదా.. ఎలా పరిష్కరించాలనేది ఆలోచించడం లేదు. కనీసం తల్లిదండ్రులతో కూర్చొని చర్చించాలనే ఆలోచన కూడా చేయడం లేదు. ఇది కూడా అలాంటి ఘటనే. ఉంగరం పోయిందని, ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.

వరంగల్ జిల్లా గున్నేపల్లికి చెందిన జానకీరామ్ కూతురు హేమలత. ఈమె డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. హన్మకొండలో హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. మొన్ననే ఉగాదికి ఇంటికొచ్చి వెళ్లింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఇచ్చిన బంగారు ఉంగరం పోగొట్టుకుంది.

ఉంగరం పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది హేమలత. తల్లిదండ్రులు ఎక్కడ తిడతారో అనే భయంతో ఫ్యాన్ కు ఉరేసుకొని, తనువు చాలించింది. హేమలత చనిపోవడంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గదిలో సూసైడ్ లెటర్ దొరికేవరకు ఆమె ఉంగరం కోసం చనిపోయిందనే విషయం బయటపడలేదు.

రీల్స్ చేయనివ్వడం లేదని ఆత్మహత్య..

ఇలాంటిదే మరో ఘటన తమిళనాడులో జరిగింది. ఇనస్టాగ్రామ్ లో రీల్స్ చేయొద్దని తండ్రి మందలించడంతో, తట్టుకోలేకపోయిన కూతురు ఆత్మహత్య చేసుకుంది.

అసలే పరీక్షా కాలం, చదువు అంతంతమాత్రం. దీంతో కూతుర్ని మందలించాడు తండ్రి కృష్ణమూర్తి. రీల్స్ చేయడం ఆపేసి చదువుకోవాలని సూచించాడు. దీంతో ప్రతీషా తట్టుకోలేకపోయింది. ఇనస్టాలో రీల్స్ చేయడం వ్యసనంగా మారింది ప్రతీషాకు. ఇప్పటివరకు 50కి పైగా వీడియోలు చేసింది.

తండ్రి ఒక్కసారిగా రీల్స్ చేయొద్దని మందలించడంలో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పెరియకుప్ప గ్రామంలో ఈ విషాధం చోటుచేసుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రతీషా వయసు కేవలం 9 ఏళ్లు. ఆమె 4వ తరగతి చదువుతోంది.