వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 40 మంది తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారు. నలుగురు కాదు 40 మంది అని రైమింగ్ కుదరడంతో టీడీపీ తన ప్రధాన ప్రత్యర్థిని వైసీపీ ఉడికిస్తోంది. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే.
ఎన్నికల సమయానికి కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశం వుంది. ఎందుకంటే సర్వే నివేదికలు కొందరు ఎమ్మెల్యేలకు ప్రజావ్యతిరేకత ఉండడమే. ఏ రాజకీయవేత్త అయినా తన ఉనికి కోసం పార్టీలను ఆశ్రయించక తప్పదు. ఈ నేపథ్యంలో వైసీపీ కాకపోతే, ప్రత్యామ్నాయం టీడీపీనే కనిపిస్తోంది. మరోవైపు రెండో ప్రాధాన్యం కింద జనసేనను ఎంచుకునే అవకాశం వుంది. దేశ స్థాయిలో బీజేపీ పేద్ద తోపు పార్టీ అయినప్పటికీ, ఏపీలో మాత్రం దాని బలం శూన్యం.
మరోవైపు జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందని విస్తృత ప్రచారం జరుగుతుండడంతో, ఆ రెండు పార్టీల వైపు కొందరు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుని చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
వైసీపీ నుంచి తమ పార్టీలోకి తీసుకుంటే. ఆల్రెడీ ఉన్న టీడీపీ నాయకులకు కోపం వస్తుందని చంద్రబాబు గ్రహించారు. దీంతో తమ పార్టీలోకి బదులు జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలను పంపేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని తెలిసింది.
ఎటూ జనసేనకు 15 నుంచి 25 లోపు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, ఆ పార్టీకి అంత మంది అభ్యర్థులను నిలిపే పరిస్థితి లేదని చంద్రబాబుకు బాగా తెలుసు. టీడీపీలోకి రావాలనుకుంటున్న ఎమ్మెల్యేలను జనసేనలోకి పంపి, అక్కడే పొత్తులో భాగంగా టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారని తెలిసింది.
అందుకే నలుగురు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలపై కూడా చంద్రబాబు నోరు మెదపడం లేదు. భవిష్యత్‌లో వచ్చే వారిని కూడా జనసేన వైపు మళ్లించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. పార్టీ వేరు తప్ప, ఎక్కడున్నా తన కోసం పని చేసే వాళ్లను చంద్రబాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకునే వుంటారు. ఇప్పుడు మరోసారి అలాంటిదే జనసేన ద్వారా ఆయన చేసుకోనున్నారు.