పాన్ ఇండియాలో సినిమాను రిలీజ్ చేయడం సమస్య కాదు. ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తే ఓ పనైపోతుంది. అలా కూడా కుదరని పక్షంలో అగ్రిమెంట్ చేసుకొని ఓన్ రిలీజ్ కు కూడా వెళ్లిపోవచ్చు. కానీ అలా రిలీజ్ చేయాలనుకున్న సినిమాకు పక్కా ప్లానింగ్ తో పబ్లిసిటీ చేయడం మాత్రం సాధారణ విషయం కాదు.
ఈ విషయంలో రాజమౌళి లాంటి టాస్క్ మాస్టర్ కే తలనొప్పులు తప్పలేదు. ఇద్దరు హీరోల్ని వెంటబెట్టుకొని దేశం చుట్టే క్రమంలో, రాజమౌళి అండ్ కో మీడియా నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంది గతంలో. ప్రమోషన్ విషయంలో తప్పులు కూడా జరిగాయి. ఇప్పుడు నాని కూడా తన పాన్ ఇండియా సినిమా విషయంలో అలాంటి తప్పటడుగులే వేశాడు.
విడుదలకు సరిగ్గా కొన్ని గంటల ముందు ఓ పాన్ ఇండియా సినిమాకు హైప్ ఇవ్వాలంటే ఏం చేయాలి? రిలీజ్ ట్రయిలర్ అనే కొత్త ట్రెండ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి, ఆ ట్రయిలర్ ఏదో రిలీజ్ చేస్తే బాగుండేది. లేదంటే కీలకమైన సమయం కాబట్టి, బజ్ ను మరింత బిల్డప్ చేసేందుకు గ్లింప్స్ రిలీజ్ చేసినా బాగుండేది.
కానీ నాని మాత్రం తన దసరా సినిమా విడుదలకు సరిగ్గా కొన్ని గంటల ముందు లిరికల్ వీడియా విడుదల చేశాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటల్లో కేవలం 2 మాత్రమే క్లిక్ అయ్యాయి. అలాంటప్పుడు ఆ సాంగ్స్ ను పక్కనపెట్టి ఆర్గానిక్ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు, టూర్స్ లాంటివి ప్లాన్ చేయాలి.
నాని కూడా అదే చేశాడు కానీ ఆఖరి నిమిషంలో మళ్లీ ఓ సాంగ్ రిలీజ్ చేసి, తనకుతానే సినిమాపై బజ్ తగ్గించుకున్నాడు. ఆ సాంగ్ ను విడుదల చేయకుండా, ఆ స్థానంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్లింప్స్ లాంటిది రిలీజ్ చేస్తే బాగుండేది.
ఈ సంగతి పక్కనపెడితే, పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాను ఓ డిస్కషన్ పాయింట్ గా మార్చడంలో మాత్రం నాని సక్సెస్ అయ్యాడు. ఇక రిజల్ట్ ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.