బాబుకే సాధ్యంకావడంలేదు…పవన్‌కు అవుతుందా?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో ఓ పని పూర్తి చేశాడు. ఆ పనేమిటో తెలుసు కదా. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ…

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో ఓ పని పూర్తి చేశాడు. ఆ పనేమిటో తెలుసు కదా. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు కొనసాగుతుందన్నాడు. అంటే ఇది ఆషామాషీ పొత్తు కాదని పవన్‌, బీజేపీ నేతలు చెప్పారు. పవన్‌ తాను మోస్తున్న భారంలో కొంత భాగాన్ని బీజేపీకి పంచడంతో కాస్తా ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉంది. ఇక ఇప్పుడు ఆయన దృష్టి తెలంగాణ మీద పడింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానన్నాడు. ఆయన పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు లేవు. 

పార్టీ నాయకులున్నారని చెప్పుకుంటున్నా వారెవరో తెలియదు. ఎప్పుడూ ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. పవన్‌ అప్పుడప్పుడూ హైదరాబాదులోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చిపోవడం తప్ప ఎలాంటి కీలక సమావేశాలు, కార్యక్రమాలూ జరపలేదు. ఈనాటివరకు ఆయన తన సర్వశక్తులను ఏపీలోనే వెచ్చించాడు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా ఏమిటో తేల్చుకోవల్సి ఉంది. తెలంగాణపై దృష్టి సారించిన పవన్‌ 'తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి' అని అభిప్రాయపడ్డాడు. అంటే పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఆ పరిస్థితులు లేవనేగా అర్థం. 

మరి ఇప్పుడు కొత్తగా పార్టీని బలోపేతం చేసే పరిస్థితులు ఏం ఏర్పడ్డాయి? అవేమిటో ఆయన వివరిస్తే బాగుండేది. అవన్నీ సామాన్య జనానికి ఎందుకు చెబుతాడులెండి. పార్టీ కార్యకర్తలకు, నేతలకు వివరిస్తాడు. ఆ పరిస్థితులు ఏమిటో తెలిస్తేనే కదా వారు పనిచేయగలిగేది. ప్రతి నెలా కొన్ని రోజులు హైదరాబాదులో ఉంటానని నేతలకు, కార్యకర్తలకు హామీ ఇచ్చాడు. ముందుగా గ్రేటర్‌ హైదరాబాదు కమిటీని ఏర్పాటు చేస్తానన్నాడు. ఎవరెవరితో ఆ కమిటీ ఏర్పాటు చేయాలో కార్యకర్తలు పేర్లు సూచిస్తే వారితోనే ఏర్పాటు చేస్తానన్నాడు. హైదరాబాద్‌ కమిటీని ఏర్పాటు చేశాక జిల్లాలవారీగా కమిటీలు ఏర్పాటు చేస్తారేమో. 

జనసేనకు పార్టీ నిర్మాణం లేకపోయినా ఏపీలో నాదెండ్ల మనోహర్‌ ఒకడు జనాలకు బాగా తెలిసిన నాయకుడు. ఈయన ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకరుగా పనిచేశాడు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. కొందరు పార్టీ అధికార ప్రతినిధులు ప్రతిరోజూ టీవీ చర్చల్లో పాల్గొంటున్నారు కాబట్టి వారి ముఖాలు జనాలకు తెలుసు. ఇక ఇంతకు మించిన నాయకులెవరూ లేరు. జేడీ లక్ష్మీనారాయణవంటివారు ప్రజలకు తెలిసినా అలాంటివారు పార్టీకీ దూరంగా అంటీముట్టనట్లుగా ఉన్నారు. జనసేనలో ఎవరైనా పవన్‌ పేరు చెప్పగలరుగాని మిగతా నాయకులు జనాలకు తెలియకపోవడమే కాకుండా వారెవరూ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో లేరు. పార్టీని ముందుకు నడిపించే స్థితిలోనూ లేరు. 

ఏపీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ జగన్‌ మనిషైపోయాడు. ఏపీలో పార్టీలోకి కొత్తగా వచ్చేవారెవరూ లేరు. సొంత రాష్ట్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక తెలంగాణలో బలోపేతం చేయగలడా? ఉమ్మడి ఏపీ, ప్రస్తుత ఏపీ కలుపుకొని పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన, నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడే తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోలేక నానా తిప్పలు పడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందిగాని ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సంగతి పవన్‌కూ తెలుసు. అయినప్పటికీ తెలంగాణలో ఇప్పటికీ కొందరైనా నాయకులు ఉన్నారు. క్యాడర్‌ ఉంది. పార్టీ వ్యవస్థ ఉంది. హైదరాబాదులో బ్రహ్మాండమైన కార్యాలయం ఉంది. 

అయినప్పటికీ బాబు ఏమీ చేయలేకపోతున్నారు. తెలంగాణలో టీడీపీతో పోలిస్తే జనసేన శూన్యమే కదా. ఈ పార్టీకి ఏపీలోనే వ్యవస్థ లేనప్పుడు తెలంగాణలో ఉండదు కదా. ఇప్పుడు పునాదుల నుంచి పార్టీని నిర్మించుకుంటూ రావాలి. పవన్‌ వంటి నాయకుడికి ఇది సాధ్యమని అనుకోలేం. రాష్ట్రంలో  అధికార టీఆర్‌ఎస్‌ అత్యంత బలంగా ఉంది. బలమైన నాయకులున్నారు. ఇక కాంగ్రెసు, బీజేపీలు గులాబీ పార్టీకి పోటీ ఇవ్వలేకపోతున్నప్పటికీ బలమైన వ్యవస్థ ఉన్న పార్టీలు. ఈ మూడు పార్టీల మధ్య జనసేన ఎదగడం కలేనని చెప్పుకోవచ్చు. అసలు ముందు పవన్‌ కార్యాచరణ మొదలుపెడితే పార్టీ సంగతి ఎలా ఉంటుందో చెప్పొచ్చు.