శిరిడీ ఉద్యమం.. బీజేపీ మార్క్ రాజకీయం

సీఏఏ వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. ముస్లింలకు మద్దతుగా ప్రాంతీయ పార్టీలన్నీ గళమెత్తుతున్నాయి. పార్లమెంట్ లో ఈ చట్టానికి అనుకూలంగా ఓటు వేసిన పార్టీలు కూడా తమ రాష్ట్రంలో సీఏఏని అమలు చేయబోమంటూ హెచ్చరికలు…

సీఏఏ వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. ముస్లింలకు మద్దతుగా ప్రాంతీయ పార్టీలన్నీ గళమెత్తుతున్నాయి. పార్లమెంట్ లో ఈ చట్టానికి అనుకూలంగా ఓటు వేసిన పార్టీలు కూడా తమ రాష్ట్రంలో సీఏఏని అమలు చేయబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిరిడీ ఉద్యమం మొదలైంది. 

శిరిడీ సాయిబాబా పుట్టిన ఊరు పాథ్రీ అభివృద్ధికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కావాలనే 100 కోట్ల నిధుల్ని పాథ్రీకి కేటాయించారని బీజేపీ రచ్చ చేస్తోంది. అటు శిరీడీ సంస్థాన్ సభ్యుల్ని కూడా రెచ్చగొట్టి, శిరిడీ ప్రాంత వాసుల్ని కూడా గందరగోళంలోకి నెట్టి ఆందోళనలకు సిద్ధం చేస్తోంది. 

పాథ్రీ అభివృద్ధి చెందితే శిరిడీకి వచ్చే నష్టమేంటి అని కనీసం భక్తులు కూడా ఆలోచించడం లేదు. అవధూతలెవరైనా వారు నిర్యాణం చెందిన ప్రాంతాలకే ఎక్కువ ప్రాశస్త్యం ఉంటుంది. అందులోనూ సాయిబాబా పుట్టిన ఊరు పాథ్రీ అనే ఆధారాలు ఎక్కడా లేవు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమ వద్ద ఆధారాలున్నాయని చెబుతున్నా.. వారి మాటలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఎన్నో దేవాలయాలున్నా.. తిరుమల క్షేత్ర మహత్యం మిగతావాటికి ఎందుకొస్తుంది. అలాగే ఊరికో సాయిబాబా మందిరం ఉన్నా కూడా శిరిడీ యాత్రను భక్తులు ప్రత్యేకంగా భావిస్తుంటారు. 

పాథ్రీ అభివృద్ధి చెంది, అక్కడి ఆలయానికి భక్తులు ఎక్కువగా వెళ్లినా కూడా శిరిడీ ఆలయ ప్రతిష్ట మసకబారే అవకాశం ఎంతమాత్రం లేదు. ఈ విషయాలు తెలియక కాదు, కేవలం రాజకీయ దురుద్దేశాలతోటే బీజేపీ నేతలు శిరిడీ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. అటు మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారుని టార్గెట్ చేసుకునే ఉద్దేశం ఒకటైతే, ఇటు దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వస్తున్న ఆందోళనల దృష్టి మరల్చడం మరో ప్రధాన ఉద్దేశం. 

దీని కోసమే బీజేపీ వేసిన కొత్త ఎత్తుగడ ఇది. చివరికి శిరిడీ క్షేత్రాన్ని కూడా రాజకీయ రొచ్చులోకి లాగేందుకు వీరు వెనకాడ్డం లేదు.