మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో కేరళ వామపక్ష సర్కార్ నడుస్తోంది. తమ రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ప్రవేశాల అనుమతిని నిరాకరిస్తూ కేరళ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మొట్ట మొదట చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కార్ రాష్ట్రంలోకి సీబీఐ రాకను అడ్డుకుంటూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై రాజకీయ ప్రేరేపిత దాడులకు మోడీ సర్కార్ తెగబడుతోందనే ఆరోపణలతో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం దేశస్థాయిలో తీవ్ర దుమారం రేపింది.
ఆ తర్వాత చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా తమ రాష్ట్రంలోకి సీబీఐ రాకను అడ్డుకున్నారు. అనంతరం ఛత్తీస్‌గడ్, ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలోకి సీబీఐ రాకను నిరోధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా కేరళ ప్రభుత్వం కూడా అదే పంథాలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన బుధవారం మంత్రి మండలి సమావేశమై సీబీఐ, ఈడీల రాకను అడ్డుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నిర్ణయం ఆల్రెడీ సీబీఐ దర్యాప్తులో ఉన్న వాటికి వర్తించదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్‌లో సీబీఐ, ఈడీ చేపట్టే కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల రాకను నిరోధిస్తూ తమ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ముఖ్యమంత్రి వెల్లడించారు.
తమ ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయాలను కించపరిచేలా కొన్ని కేంద్ర ఏజెన్పీలు పని చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. ఇది తమ ప్రభుత్వాన్ని అవమానపరిచేదిగా భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు తమ ప్రభుత్వం అనుమతించదని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ కే ఫోన్, ఈ-మొబిలిటీ హబ్, స్మార్ట్ సిటీ, డౌన్‌టౌన్ వంటి నాలుగు ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాల్సిందిగా చీఫ్ సెక్రటరీని ఈడీ ఆదేశించిందన్నారు.
ఈ ఏజెన్సీలు కొన్ని ప్రత్యేక ఎజెండాతో పని చేస్తున్నాయని, వారి ఎత్తుగడలు సమాఖ్య రాజ్యాంగానికి విరుద్ధమని విజయన్ చెప్పుకొచ్చారు. ఇటీవల కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన బంగారు రవాణా విషయమై కూడా ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
బంగారు అక్రమ రవాణా కేసు ప్రాథమిక దర్యాప్తు సరైన మార్గంలో సాగిందని, ఆ తర్వాత పక్కదారి పట్టిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కావాలని ప్రభుత్వ పెద్దల్ని ఇరికించాలనే కుట్రల్ని పసిగట్టినట్టు ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా కేంద్ర దర్యాప్తు సంస్థల రాకను అడ్డుకునే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాడు సీబీఐ అంటే అంతెత్తున ఎగిరిన చంద్రబాబు … ఇప్పుడు జగన్ సర్కార్‌పై మాత్రం నోరు తెరిస్తే ఆ దర్యాప్తును కోరడం గమనార్హం.