ఆంధ్రప్రదేశ్ జనానికి వామపక్ష పార్టీ సీపీఎం అఫిడవిట్‌తో గంతలు కడుతోంది. తన పార్టీ కేడర్, అలాగే ప్రజాశక్తి పాఠకులంటే ఎంత చిన్న చూపో తెలిస్తే … సీపీఎం వైఖరిపై జుగప్స కలుగుతుంది.
హైకోర్టులో తమ పార్టీ దాఖలు చేసిన అఫిడవిట్‌తో పాటు ప్రజాశక్తిలో దానికి సంబంధించిన పొంతన లేని, మోసపూరిత కథనాన్ని చదువుతుంటే రక్తం మరుగుతోందని రాయలసీమకు చెందిన ఓ సీపీఎం నేత వాపోయారు.
దేశంలో రోజురోజుకూ వామపక్షాలు ఎందుకు ప్రజాదరణ కోల్పో తున్నాయో ఉదహరించేందుకు మూడు రాజధానుల విషయమై సీపీఎం దాఖలు చేసిన అఫిడవిట్టే నిదర్శనం.
తెలుగు సమాజంలో ఒక్కో పార్టీకి ఒకటి లేదా అంతకు మించి అధికార, అనధికార పత్రికలు, చానళ్లు ఉన్నాయి.
పత్రికల విషయానికి వస్తే టీడీపీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, వైసీసీకి సాక్షి, సీపీఐకి విశాలాంధ్ర, సీపీఎంకు ప్రజాశక్తి అధికార పత్రికలే. ఆ పత్రికల్లో పార్టీకి సంబంధించిన వార్త వచ్చిందంటే … అది ఆ పార్టీ అధికార అభిప్రాయ మని జనం అర్థం చేసుకుంటారు.
ఈ నేపథ్యంలో నేడు సీపీఎం అధికార పత్రిక ప్రజాశక్తి మొదటి పేజీలో “అమరావతే రాజధాని …. సీపీఎం కౌంటర్ అఫిడ విట్ దాఖలు” శీర్షికతో ప్రాధాన్యతతో ఓ వార్తా కథనాన్ని ప్రచురించారు.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను వ్యతిరే కిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న హైకోర్టు ఈ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని కూడా చెప్పాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సీపీఎం తన వైఖరిని వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, సుంకర రాజేంద్రప్రసాద్‌లు ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు.
ఈ అఫిడవిట్‌కు సంబంధించి తన అధికారిక పత్రిక ప్రజాశక్తిలో ఏం రాశారో చూద్దాం.
“రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, అదే సమయలో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని సిపిఎం పేర్కొంది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు బుధవారం హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ' అభివృద్ధి వికేంద్రీకరణకు మా పార్టీ వ్యతిరేకం కాదు. రాజధానిని వికేంద్రీకరించకుండా దానిని సాధించాలి' అని ఆయన పేర్కొన్నారు.
హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది రాజధానితో సంబంధం లేని ప్రత్యేక స్వతంత్ర అంశమని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన ఆయన 'కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని మా పార్టీ భావిస్తోంది' అని తెలిపారు”
అయితే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు అఫిడవిట్‌లో బూతద్దంతో వెతికినా ఎక్కడా కనిపించదు. అలాగే హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది రాజధానితో సంబంధం లేని ప్రత్యేక స్వతంత్ర అంశమని కోర్టు దృష్టికి ఎక్కడ తెచ్చారో కూడా అర్థం కాదు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల ప్రజల్ని మాయ చేసి మభ్య పెట్టేందుకు అఫిడవిట్‌లో లేని దాన్ని ఉన్నట్టు తన సొంత పత్రికలో రాశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే ఈ అఫిడవిట్‌పై సీపీఎం శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంగ్లీష్‌లో ఉన్న అఫిడవిట్‌ను ఎవరూ చదవరనే లెక్కలేనితనమా? లేక ఇంగ్లీష్ ఎవరికీ రాదనే నమ్మకమా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పార్టీ అగ్రనాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన సొంత పత్రిక పాఠకులను మోసగించేందుకు ఇంత బరితెగింపా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, నిష్పాక్షికత, వంకాయ, కాకరకాయ, టెంకాయ అంటూ ఉపన్యాసాలు చెప్పే సీపీఎం …తమ వద్దకు వచ్చే సరికి అవేవీ వర్తించవన్న రీతిలో నిసిగ్గుగా, నిర్లజ్జగా ప్రజాశక్తిలో పనికట్టుకుని కట్టు కథనం రాసిందని కేడర్ తీవ్రంగా మండిపడుతోంది.
అసలు సీపీఎం అఫిడవిట్‌లో ఏముందో తెలుసుకుందాం.
“శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిపాలనా వికేంద్రీకరణ చట్టం కేంద్ర, ఏపీ పునర్విభజన చట్టాలకు విరుద్ధమైంది.
పాలనా వికేంద్రీకరణ బిల్లులకు మేం వ్యతిరేకం. మేం అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకం కాదు, పాలనా వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నాం. రాజధానికి భూములిచ్చిన వేలాది మంది రైతుల ఆశలను ఫణంగా పెట్టి వికేంద్రీకరణ చేయడం సరికాదు.
సీపీఎం సమగ్రాభివృద్ధి కోరుకుంటోంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే” అని విస్పష్టంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తన అఫిడవిట్‌లో మూడు రాజధానులను వ్యతిరేకించారు.
మరి ప్రజాశక్తిలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అఫిడవిట్‌లో పేర్కొనడం …ఆ పార్టీ శ్రేణుల్ని, ఆ పత్రిక పాఠకుల్ని వంచించడం తప్ప మరొకటి కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాలనా వికేంద్రీకరణ బిల్లులకు తాము వ్యతిరేకమని స్పష్టంగా అఫిడవిట్‌లో చెబుతున్నప్పుడు … మరోవైపు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనుకూలమని చెప్పడం అంటే …సమాజ చైతన్యం మీద సీపీఎంకు అంత చులకనా? లేదంటే తాము చెప్పిందే తప్ప ఎవరూ అఫిడవిట్‌ను అధ్యయనం చేయరనే అహంకారామా?
రాజుగారి వస్త్రాల కథ మాదిరిగా సీపీఎం అఫిడవిట్‌లో కర్నూలులో రాజధాని పెట్టాలని కోరినట్టుందని ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పచ్చి దగా, మోసం, వంచన, ద్రోహం అనే పదాలకు అర్థాలేంటో ఇప్పుడు తెలిసొచ్చిందని ఆ 29 గ్రామాలు మినహా మిగిలిన ప్రాంతాల్లోని ప్రజానీకం సీపీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఏపీలో ఒక సీటు కూడా లేని సీపీఎం ఎవరి కోసం? ఎందుకోసం ఇంతగా దిగజారాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలనే ఆ పార్టీకి చెందిన రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే తెలంగాణ ఏర్పాటు విషయానికి వస్తే తాము సమైక్యాం ధ్రకు కట్టుబడి ఉన్నామని సీపీఎం ఎంతో నిజాయితీగా తీర్మానించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేవలం ఆ 29 గ్రామాల ప్రయోజనాల కోసమే పార్టీ సిద్ధాంతాలను, విశ్వసనీయతను తాకట్టు పెట్టడం ఏంటని సొంత పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.
ఒకప్పుడు ఇదే సీపీఎం తాము ల్యాండ్ ఫూలింగ్‌కు వ్యతిరేకమని, ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదని ఉద్యమాలు నడిపిన సీపీఎం … ఇప్పుడు దాన్ని సమర్థిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని సొంత పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తు న్నాయి.
రాజధానికి భూములిచ్చిన వేలాది మంది రైతుల ఆశలను ఫణంగా పెట్టి వికేంద్రీకరణ చేయడం సరికాదంటున్న సీపీఎం … వాళ్లందరి కోసం మిగిలిన రాష్ట్ర రైతాంగాన్ని ముంచేందుకు సమ్మతిస్తుందా? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీస్తున్నారు.
నిజానికి ఏపీలో పాలించే అవకాశం రాకపోవడం వల్లే సీపీఎం ఇంత కాలం గౌరవంగా నెట్టుకొచ్చిందని, అదే నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సి వస్తే అసలు నైజం ఏంటో ఇప్పుడు బట్టబయలైందని ప్రజానీకం మండిపడుతోంది.
ఇంకా నయం వీళ్లకే అధికారం చేతికిస్తే తడిగుడ్డలతో గొంతలు కోస్తారనే విమర్శలు నిజమనే రీతిలో సీపీఎం తాజా అఫిడవిట్ నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.