గుజ‌రాత్‌లో నైనై …ఏపీలో సైసై

అది దేశానికి ప్ర‌ధానిని అందించిన రాష్ట్రం. ఆ రాష్ట్ర‌మే గుజ‌రాత్‌. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష న‌ర్ (ఎస్ఈసీ) ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో…

అది దేశానికి ప్ర‌ధానిని అందించిన రాష్ట్రం. ఆ రాష్ట్ర‌మే గుజ‌రాత్‌. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష న‌ర్ (ఎస్ఈసీ) ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు గుజ‌రాత్ ఎస్ఈసీ స‌సేమిరా అన్నారు. 

కానీ గుజ‌రాత్ కంటే ఎక్కువ క‌రోనా కేసులు న‌మోదు అవుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎస్ఈసీ ఉత్సాహం క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్పుడిదే ఏపీ స‌ర్కార్‌, ఎస్ఈసీ మ‌ధ్య ర‌చ్చ‌కు దారి తీస్తోంది. చివ‌రికి వ్య‌వ‌హారం హైకోర్టు వ‌ర‌కు వెళ్లింది.

క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం స‌బ‌బు కాద‌ని ఏపీ స‌ర్కార్ వాదిస్తోంది. కానీ గ‌తంలో కంటే కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని, ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని మెజార్టీ రాజ‌కీయ పార్టీలు అభిప్రాయ‌ప‌డుతున్నాయ‌ని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ వాదిస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఆ రాష్ట్ర ఎస్ఈసీ వాయిదా వేయ‌డాన్ని ఏపీ ప్ర‌భుత్వం తెర మీద‌కు తెచ్చింది. గుజరాత్‌లో 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలు, 55 మున్సిపాలిటీల ప్ర‌జాప్రతినిధుల‌ పదవీ కాలం  వ‌చ్చే నెల అంటే డిసెంబర్‌ రెండో వారంతో ముగుస్తోంది.  

అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్  20 రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే భిన్న‌మైన ప‌రిస్థితి. మ‌న రాష్ట్రంలో 2018 ఆగస్టు 1 నాటికే   గ్రామ పంచాయతీలు, జూలై 5వ తేదీ  నాటికే మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిపోయింది.

అంటే ఏడాది, రెండేళ్ల క్రిత‌మే ప‌ద‌వీ కాలాల గ‌డువు ముగిసింద‌ని అర్థం చేసు కోవ‌చ్చు. అప్ప‌టి నుంచి ఇన్‌చార్జ్‌ల పాల‌నే సాగుతోంది. ఈ ఏడాది మార్చిలో ఎట్ట‌కేల‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద లైంది. పెద్ద సంఖ్య‌లో ఏక‌గ్రీవాల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఆక‌స్మికంగా ప్ర‌క‌టించారు.

అప్ప‌ట్లో రోజుకు 2, 3 కేసులు మాత్ర‌మే న‌మోదవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత అదే నెల చివ‌రి వారంలో దేశం వ్యాప్తంగా లాక్‌డౌన్ మొద‌లైంది. ఇప్పుడు రోజుకు వేల సంఖ్య‌ కేసులు నమోదవుతున్నాయి.

గుజ‌రాత్‌లో న‌మోదవుతున్న కేసుల‌తో పోల్చితే ఏపీలో రెండింత‌లు ఎక్కువ‌ని లెక్క‌లు చెబుతున్నాయి. అయినా స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ను కోవ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.  

ఇప్పుడీ వ్య‌వ‌హారం హైకోర్టు ప‌రిధిలో ఉంది. న్యాయ‌స్థానం నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కొంది.  అలాగే ఎలాగైనా ఎన్నిక‌ల‌ను వాయిదా వేయించాల‌నే త‌లంపుతో ఏపీ స‌ర్కార్ ఎంతో శ్ర‌మిస్తోంది. 

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌య‌మై ఏఏ రాష్ట్రాల్లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నారో వెతుకుతోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను మ‌రోసారి వాయిదా వేయించేందుకు ఏపీ స‌ర్కార్ చేస్తున్న ప్ర‌య‌త్నం ఏ మాత్రం ఫ‌లిస్తుందో చూడాలి మ‌రి!

బాబు జూమ్ సౌండుకి, వైసిపీ నో రీసౌండ్