సదుపాయాలు పెంచం.. రేట్లు మాత్రం పెంచేయండి

అదే వితండవాదం, మళ్లీ అదే వాదన. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారంపై ఏర్పాటుచేసిన కమిటీ ఈరోజు సమావేశమైంది. రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన సమావేశమైన 13 మంది సభ్యుల బృందంలో కొంతమంది…

అదే వితండవాదం, మళ్లీ అదే వాదన. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారంపై ఏర్పాటుచేసిన కమిటీ ఈరోజు సమావేశమైంది. రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన సమావేశమైన 13 మంది సభ్యుల బృందంలో కొంతమంది వితండవాదం చేసినట్టు తెలుస్తోంది. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే రకంగా వాళ్ల వ్యవహార శైలి ఉందంట.

నిబంధనలు పాటించలేదు కాబట్టి అధికారులు థియేటర్లు సీజ్ చేశారు. అలా సీజ్ చేసిన థియేటర్లను కూడా లిస్ట్ లో కలిపేసి, టికెట్ రేట్లు తగ్గించారు కాబట్టే థియేటర్లు మూతపడ్డాయని సమావేశంలో కొంతమంది ఎగ్జిబిటర్లు వాదించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏకంగా 200 థియేటర్లు మూతపడ్డాయని, టికెట్ రేట్లు పెంచితే అవన్నీ తిరిగి తెరుచుకుంటాయని చెప్పడం విడ్డూరం. 

నిబంధనల గురించి అధికారులు ప్రశ్నించినప్పుడు మాత్రం, రూల్స్ ను కాస్త సవరించాలని కోరారు ఎగ్జిబిటర్లు. బి, సి సెంటర్లలో ఉన్న థియేటర్లలో ఉన్నఫలంగా టికెట్ రేట్లు పెంచాలనేది వీళ్ల వాదన.

టాయిలెట్స్ ఉండవు.. టికెట్ రేటు మాత్రం ఎక్కువే

ఇదే కమిటీలో ఉన్న ప్రేక్షకుల సంఘం వాదన మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. పంచాయతీలు, మున్సిపాల్టీ పరిథిలో ఉన్న థియేటర్లలో కనీస సౌకర్యాలు కూడా ఉండవని, అలాంటప్పుడు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనేది వీళ్ల ప్రశ్న. టాయిలెట్స్ శుభ్రంగా ఉండవని, పార్కింగ్ ఫీజు ఎక్కువగా వసూలు చేస్తున్నారని, క్యాంటీన్ లో స్నాక్స్ ధరలు కూడా 3 రెట్లు ఎక్కువగా అమ్ముతున్నారని వీళ్లు నివేదించారు.

కేవలం టికెట్ రేట్ల అంశాన్ని మాత్రమే చర్చకు తీసుకోకుండా, వీటిని కూడా చర్చలోకి తీసుకోవాలని ప్రేక్షకుల సంఘం సభ్యులు వాదించారు. ఈ సందర్భంగా ఎయిర్ కండిషనర్ పేరు చెప్పి సాగిస్తున్న దందాను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఏసీ థియేటర్ అని చెప్పి టికెట్ రేటు పెంచి, సినిమా ప్రారంభమైన 30 నిమిషాలకు ఏసీలు ఆపేస్తున్నారని.. బి, సి సెంటర్లలోని ప్రతి థియేటర్ లో ఇలా జరుగుతోందని ఆరోపించారు. వీటిపై ఎగ్జిబిటర్లు స్పందించలేదు.

నిర్మాతలకు ఝలక్

మరోవైపు సమావేశంలో నిర్మాతలపై ఆసక్తికర చర్చ సాగింది. కమిటీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొందరు నిర్మాతల అంశాన్ని తెరపైకి తెచ్చారు. వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారని, వాళ్లకు గిట్టుబాటు అవ్వాలంటే ఫ్లెక్సీ రేట్లు అమలు చేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని అధికారులు వెంటనే అడ్డుకున్నారు. కేవలం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కోణంలో మాత్రమే టికెట్ రేట్ల అంశాన్ని చెప్పాలని.. నిర్మాతల కోణంలో మాట్లాడొద్దని క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తోంది.

బి, సి సెంటర్లలో ఎలాంటి రేట్లు ఉంటే థియేటర్లు నడపగలరో చెప్పాలని, నిర్మాతలు-బడ్జెట్-హీరో లాంటి అంశాల్ని ప్రస్తావించొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. సినిమా ఏదైనా బి, సి సెంటర్లలో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడు ఇబ్బంది పడకుండా, ఎగ్జిబిటర్ నష్టపోకుండా ఉండే మధ్యేమార్గాన్ని మాత్రమే చెప్పాలన్నారు.

ఉన్నంతలో పంచాయతీలు, నగర పంచాయతీల పరిథిలో ఉన్న థియేటర్లలో ఇప్పుడున్న రేట్లు కంటే ఇంకాస్త ఎక్కువగా టికెట్ ధరల్ని పెంచొచ్చని ఏకాభిప్రాయానికొచ్చారంతా. ఈ విషయంపై ప్రేక్షకుల సంఘం సభ్యులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. త్వరలోనే కమిటీ సభ్యులు మరోసారి సమావేశం కానున్నారు.