సచివాలయ ఉద్యోగులు లేనిపోని పౌరుషానికి పోతున్నారు, ఫలానా టైమ్ కి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, అర్థం చేసుకోకుండా విధులు ఎగ్గొట్టి రోడ్లపైకి వచ్చారు. పీఆర్సీ కోసం పోరాటం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా విధులకు డుమ్మా కొట్టి రోడ్డెక్కలేదు. కానీ సచివాలయ ఉద్యోగులు ఉడుకు రక్తంతో ధైర్యం చూపించాలనుకున్నారు. ఈ వ్యవహారం బెడిసికొడుతుందా..? విధులకు రానివారి స్థానాన్ని వాలంటీర్లతో తాత్కాలికంగా భర్తీ చేస్తారా..? సచివాలయాలు, ఉద్యోగుల క్రమశిక్షణ విషయంలో ఉన్నతాధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి..?
వాట్సప్, టెలిగ్రామ్ యాప్స్ లో ఉన్న రెవెన్యూ గ్రూపుల్లో ఓ ఆసక్తికర సందేశం చక్కర్లు కొడుతోంది. దీన్ని ఎవరు సృష్టించారో కానీ సచివాలయ ఉద్యోగుల్లో లేనిపోని భయాలు మొదలయ్యాయి. అర్హత ఉన్న వాలంటీర్లకు తాత్కాలికంగా సచివాలయ ఉద్యోగుల విధులను అప్పగిస్తారనేది ఆ సందేశం సారాంశం. వాస్తవానికి వాలంటీర్లలో కూడా డిగ్రీలు చదివి, పీజీలు చదివినవారు చాలామంది ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల కంటే తెలివైనవారు, టెక్నికల్ నాలెడ్జి ఉన్నవారు కూడా కనిపిస్తారు. అలాంటి వారితో కొన్ని రోజులు పని చేయించుకుంటే ఏమవుతుంది..? మేం లేవనిదే తెల్లవారదని అనుకుంటున్న సచివాలయ ఉద్యోగుల సంగతేంటి..?
సచివాలయ ఉద్యోగుల జీతాలు తక్కువే కాదనలేం. కానీ అంతకంటే తక్కువ జీతాలు, తక్కువ సంపాదనతో ఇల్లు నెట్టుకొస్తున్నవారు లేరా..? ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడుతున్న యువత అంతా జగన్ ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ తో సచివాలయ ఉద్యోగి అనే క్వాలిఫికేషన్ సంపాదించింది. ఉద్యోగం వచ్చిన తర్వాత వీరందరికీ సమాజంలో గౌరవం పెరిగింది, ప్రభుత్వ ఉద్యోగి అనే అర్హతతో చాలామందికి పెళ్లిళ్లు అయ్యాయి. ఒక్క వేతనం విషయంలో అసంతృప్తి ఉందేమో కానీ, పని వేళలు, సౌకర్యాలు, ఇతర విషయాల్లో ఎక్కడా ఎవరికీ ఏ లోటూ లేదు.
సచివాలయ ఉద్యోగులకు రేషన్ కార్డులు తీసేశారని, వారి తల్లిదండ్రులకు పింఛన్లు ఇవ్వడంలేదనేది మరో ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగులకి అలాంటి సౌకర్యాలేవీ ఉండవు. ఒకవేళ అలాంటి సౌకర్యాలే కావాలనుకునేవారికి ఉద్యోగం చేయాల్సిన పనేంటి. రెండిటిలో ఏది కావాలో వారే నిర్ణయించుకోలేరా. ఒకవైపు తల్లికి పింఛన్, ఇంకోవైపు తనకి ఉద్యోగం. ఉద్యోగంలో చేరి తల్లిని పోషించే స్థోమత ఉన్నవారికి పింఛన్ కూడా కావాలా..? ఇలాంటి వితండవాదాలు చేసి జనంలో మరింత పలుచన అవుతున్నారు సచివాలయ ఉద్యోగులు.
తాజాగా వాలంటీర్లను సచివాలయ సేవలకు ఉపయోగించుకుంటారనే ప్రచారం రావడంతో వారిలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తుంది. మరి తెగేదాకా లాగుతారా, లేక సామరస్యంగా సమస్యలను చక్కదిద్దుకుంటారా.. అంతా ఉద్యోగుల చేతుల్లోనే ఉంది.