కర్నూలు ఆత్మకూరులో మైనార్టీలకు చెందిన ప్రార్థనా మందిరం నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా ఏపీ అధికార పార్టీని బీజేపీ టార్గెట్ చేసింది. హిందుత్వానికి తానే ప్రతినిధిగా చాటి చెప్పేందుకు బీజేపీ ఆత్మకూరు ఘటనను వాడుకుంటోందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కు పెట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆంధ్రాను తాలిబాన్లుగా పాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఉగ్రవాదపార్టీగా ఆయన అభివర్ణించడం గమనార్హం. ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటన్నారు. ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కానే కాదన్నారు.
వైసీపీ, బీజేపీ మధ్య జరిగిన సంఘటనగా ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలను కేసు నుంచి తప్పించేందుకే మత ఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఎస్డీఎఫ్ రూపంలో ఉగ్రవాదమూకలు పని చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయ సూచనలతోనే ఆత్మకూరులో దాడులు చేశారన్నారు. ఐపీసీని వైసీపీగా మార్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పులులు ఢిల్లీలో పిల్లులు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
ఆత్మకూరు ఘటనలో ఎలాగైనా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే హిందువుల మనసుల్లో విషం నింపి, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ ఆ కోణంలో విమర్శలు చేయడాన్ని గమనించొచ్చు. అయితే ఏపీ సమాజం మతసహనం పాటించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అందువల్లే బీజేపీ పప్పులుడకడం లేదు. కానీ తన ప్రయత్నాలను బీజేపీ విరమించలేదనేందుకు తాజా విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపణలే నిదర్శనం.