అక్క‌డ టికెట్‌ ధ‌ర రూ.2,200..ఇక్క‌డ రూ.200!

టికెట్ల ధ‌ర‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం నియంత్రించ‌డాన్ని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ త‌ట్టుకోలేకున్నారు. ప‌దేప‌దే ట్విట‌ర్ వేదిక‌గా త‌న అస‌హ‌నాన్ని, ఆగ్ర‌హాన్ని ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ఏపీ మంత్రి పేర్ని నానితో…

టికెట్ల ధ‌ర‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం నియంత్రించ‌డాన్ని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ త‌ట్టుకోలేకున్నారు. ప‌దేప‌దే ట్విట‌ర్ వేదిక‌గా త‌న అస‌హ‌నాన్ని, ఆగ్ర‌హాన్ని ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ఏపీ మంత్రి పేర్ని నానితో సోమ‌వారం ఆర్జీవీ చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. త‌మ మ‌ధ్య చ‌ర్చ‌లు సంతృప్తిక‌రంగా జ‌రిగిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించే హ‌క్కు ఫిల్మ్ మేక‌ర్స్‌కే ఉండాల‌నే త‌న అభిప్రాయాన్ని ప్ర‌భుత్వానికి చెప్పిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌త్యేకంగా ఆయ‌న ట్వీట్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌హారాష్ట్ర‌, ఏపీల‌లో టికెట్ల ధ‌ర‌ల వ్య‌త్యాసాన్ని ప్ర‌స్తావించారు.

“మ‌హారాష్ట్ర‌లో ఆర్ఆర్ఆర్ టికెట్ల ధ‌ర రూ.2,200 వ‌ర‌కు అనుమ‌తించారు. ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోడానికి అనుమ‌తుల్లేవు. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతుంది. ఐనాక్స్ మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో రూ.2,200 వ‌ర‌కు టికెట్లు విక్ర‌యిస్తున్నారు” అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

టికెట్ ధ‌ర రూ.200 అంటే త‌క్కువ అనుకోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఆర్జీవీ పేర్కొంటున్న‌ట్టు మ‌హారాష్ట్ర‌లో మాదిరిగా టికెట్ల ధ‌ర పెడితే…జ‌నం సంగ‌తి ఏం కావాలి? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. భారీ స్థాయిలో టికెట్ల రేట్లు పెడితే …అప్పుడు క‌ట్ట‌ప్ప‌లెవ‌రు? బాహుబ‌లులెవ‌రు? అవుతారో ఆర్జీవీనే చెప్పాల‌నే కామెంట్స్ వ‌స్తున్నాయి. 

మ‌ధ్యే మార్గంగా టికెట్ల ధ‌ర‌లు ఉండాల‌ని కోరుకోవ‌డం త‌ప్పు లేదు కానీ, మ‌హారాష్ట్ర‌లో మాదిరిగా రూ.2,200 కు విక్ర‌యించాల‌నేది ఆర్జీవీ ఉద్దేశ‌మా? అని ఆర్జీవీని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. అయినా సినిమా విడుద‌ల‌నే వాయిదా వేసుకున్న‌ప్పుడు…టికెట్ల ధ‌ర‌ల‌తో ప‌నేంటి? అని ప్ర‌శ్నించే వాళ్లు లేక‌పోలేదు.