తన సామాజిక వర్గ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తున్న ఒకే ఒక్క కాపు నాయకుడు ఎవరని ప్రశ్నిస్తే ముద్రగడ పద్మనాభం పేరే వినిపిస్తుంది. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలనే డిమాండ్‌తో ఆయన పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను నాటి చంద్రబాబు నేతృత్వంలోని పోలీసులు బండబూతులు తిట్టడం, చేయి చేసుకోవడం తెలిసిందే. నాటి చేదు జ్ఞాపకాలను ముద్రగడ మరిచిపోలేకున్నారు.
ఇటీవల దళిత, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలను కలుపుకుని కాపుల నేతృత్వంలో ఏపీలో మూడో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ముద్రగడ ఆధ్వర్యంలో మొదలయ్యాయి. దీన్ని జనసేనాని పవన్‌కల్యాణ్ అభిమానులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
పవన్‌కల్యాణ్‌కు వ్యతిరేకంగా ముద్రగడ పావులు కదుపుతున్నారనే తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ నీతి, నిజాయితీ, నిబద్ధతలతపై సోషల్ మీడియా వేదికగా కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఈ ధోరణి ముద్రగడను హర్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో తన మనస్తత్వం ఎలాంటిదో, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తన కష్టాలు తెలుసుకుని డబ్బు ఆఫర్ చేసినా కాదన్న వైనాన్ని ఆయన సమాజానికి చాటి చెప్పారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతున్న వారికి సమాధానంగా ఆయన ఇవాళ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తానెవరికీ భయపడనని తేల్చి చెప్పారు. అదేంటో చూద్దాం.
“ఈ మధ్య రాజకీయాలలో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించటం, పనిచేసే వారిని దగాకోరులు, దొంగలు అని చెప్పించడం మంచిదేనంటారా? ప్రజలకు చేసే సేవలో ఎప్పుడూ ఫలితం ఆశించని మనిషిని. ప్రయత్నాలు విఫలం లేక సఫలం కావచ్చు. ఈ మధ్య భుజాలు తడుముకునే వారు అనేక రకాలుగా సోషల్ మీడియాలో బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు, ఆఖరికి గౌరవ ప్రముఖులు గురించి ఒక మాట రాస్తే తప్పుగా చిత్రీకరిస్తున్నారు, మంచిని మంచని చెప్పడం తప్పా? వారి పోస్టింగులకు బెదిరిపోయి పారిపోతాను అనుకుంటున్నారేమో.
అలా బెదిరిపోవడానికి, నేను ఎన్.ఆర్.ఐని కాదు. భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పుట్టాను. బంతిని ఎంతగట్టిగా కొడితే అంత స్పీడుగా పైకి లేస్తుంది. నాకున్న బలమైన ఆలోచనలు… మీరు తిడుతున్నారని వదలి పెట్టను. ఎవరికోసం త్యాగం చేయను. నా న్యాయమైన ఆలోచనలు, అభిప్రాయాలు అమలు చేయవద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు” అంటూ గట్టిగా హెచ్చరించారు.
ముద్రగడ లేఖలోని హెచ్చరికలు తగలాల్సిన వాళ్లకే సూటిగా గుచ్చుకుని వుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఆయనపై తప్పుడు పోస్టింగులు ఆగుతాయేమో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.