కర్నూలు జిల్లా ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనపై టీడీపీ, జనసేన మౌనం పాటించాయి. ఆత్మకూరులో ఓ పాఠశాల వెనుక మైనార్టీలకు చెందిన ప్రార్థనా మందిరం నిర్మాణం విషయంలో గొడవ తలెత్తింది. మతం ప్రాతిపదికన రాజకీయాలకు పాల్పడే బీజేపీ ఇదో సువర్ణావకాశంగా భావించింది.
ప్రార్థనా మందిరాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బీజేపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో అడ్డుకోవడం, ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో ప్రతిఘటించడంతో వివాదం పెద్దదైంది. చివరికి ఆత్మ రక్షణార్థం బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో తలదాచుకోవడం, అక్కడికెళ్లిన ఓ వర్గానికి చెందిన ప్రజలు సదరు బీజేపీ నాయకుడి వాహనాన్ని దగ్ధం చేసిన సంగతులు తెలిసిందే.
ఈ ఘటనకు నిరసనగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఈ ఘటనపై స్పందించక పోవడం గమనార్హం. జనసేన పంథానే ఆ పార్టీ అనధికార మిత్రపక్షం టీడీపీ కూడా అనుసరించింది. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే మైనార్టీ వర్గానికి చెందిన ఓట్లను పోగొట్టుకుంటామనే భయమే…జనసేన, టీడీపీలను నోరు తెరవనీయలేదనే ప్రచారం జరుగుతోంది.
మరీ ముఖ్యంగా కులం, మతం, రాజకీయాలపై ధర్మోపన్యాసాలు వల్లించే జనసేనాని పవన్‌కల్యాణ్ ఇవేవీ తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు చలో ఆత్మకూరుకు పిలుపు ఇవ్వనున్నట్టు బీజేపీ హెచ్చరిస్తోంది. కారణాలేవైనా ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు సంయమనం పాటించడం సమాజ శ్రేయస్సు దృష్ట్యా మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.