దేశంలో కరోనా మూడో వేవ్ పీక్ స్టేజీ దిశగా పయనిస్తూ ఉంది. ఇప్పటికే దేశానికి రెండు కరోనా వేవ్ లను చూసిన అనుభవం ఉంది. దాని ద్వారా అర్థం అవుతున్న అంశం ఏమిటంటే.. కరోనా వేవ్ కనీసం రెండు నెలల పాటు తీవ్రంగా సాగుతుంది.
సరిగ్గా గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకెండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. లక్షల మంది ప్రాణాలను తీసింది. కోట్ల మందిని ఇబ్బంది పెట్టింది. వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.
అంతకు ముందు ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కరోనా ఫస్ట్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఈ అనుభవాల దృష్ట్యా చూస్తే.. ఈ ఏడాది జనవరిలో కరోనా పీక్ స్టేజీ దిశగా పయనం మొదలుపెట్టింది కాబట్టి, ఫిబ్రవరి, మార్చి నెలాంతం వరకూ కూడా కరోనా ప్రభావం గట్టిగానే ఉండవచ్చు. వేవ్ శరవేగంగా పైకి ఎగస్తోంది. వారం రోజుల లోపే రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్షన్నరను దాటేసింది!
మరి ఈ సారి పీక్ స్టేజీలో కేసులు రోజుకు ఎన్ని లక్షలకు చేరతాయో! ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ షెడ్యూల్ ప్రకటించేసింది. జనవరి పది నుంచి మొదలుపెడితే, మార్చి పది వరకూ ఈ ఎన్నికల హడావుడి కొనసాగనుంది.
అందులోనూ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దాదాపు ఇరవై కోట్ల జనాభా ఉన్న యూపీ ఉంది! పదిహేను కోట్ల మంది ఓటర్లు ఓటేయాలక్కడ! ఈ ఎన్నికలు వివిధ పార్టీలకు ప్రతిష్టాత్మకం. భారీ ర్యాలీలు, ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచార సభలు అంటే ఎలా ఉంటాయో సీఈసీకి తెలియనిది కాదు! ప్రభుత్వానికి తెలియనిది కాదు!
ఎన్నికల కార్యక్రమాలతో యూపీలో కరోనా విజృంభణ విపరీత స్థాయికి చేరినా ఏ మాత్రం ఆశ్చర్యం లేదు! పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుందేమో అనే ఆందోళన కూడా తప్పదు. కేవలం యూపీ అనే కాదు.. పంజాబ్, గోవా.. ఇలా ఏ రాష్ట్రం స్థాయికి అక్కడ రాజకీయ కార్యకలాపాలు సాగుతాయి.
జనవరి పదిహేను వరకూ యూపీలో భారీ ఎన్నికల ర్యాలీలను సీఈసీ నిషేధించింది! మరి ఆ తర్వాత ఏం చేస్తారు? ప్రచారం చేయవద్దు అంటూ పార్టీలని ఆపి ఎన్నికలను నిర్వహిస్తారా? అది సాధ్యమా? తన ఆదేశాలను సీఈసీ ఏ మేరకు అమలు పరచగలదు? ప్రభుత్వాల సహకారం ఎంత ఉంటుంది? పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడాన్నే ఆపలేని ఎన్నికల కమిషన్.. కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు పూనుకుని సాధించేది ఏమిటి?
కరోనా పరిస్థితులను అత్యవసరంగా భావించి.. ఎన్నికలను మరో రెండు నెలల పాటు వాయిదా వేసి ఉంటే వచ్చే నష్టం ఎవరికి? లాక్ డౌన్లు, ఆంక్షలను పెట్టుకుని కాలం గడపాల్సిన సమయంలో… ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం అంటే.. నష్టం ఎవరికి? అంతిమంగా ప్రజలకే!