మంత్రి..ఆర్జీవీ..మీడియా..ఎవరికి లాభం?

వన్ ఫైన్ మార్నింగ్ ఉన్నట్లుండి దర్శకుడు ఆర్జీవీ ఆంధ్రలో సినిమా టికెట్ రేట్ల విషయాన్ని తలకు ఎత్తుకున్నారు. ఆయన లాజిక్ లు ఆయన ప్రదర్శిస్తూ ట్వీట్ లు వేసారు. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఏ…

వన్ ఫైన్ మార్నింగ్ ఉన్నట్లుండి దర్శకుడు ఆర్జీవీ ఆంధ్రలో సినిమా టికెట్ రేట్ల విషయాన్ని తలకు ఎత్తుకున్నారు. ఆయన లాజిక్ లు ఆయన ప్రదర్శిస్తూ ట్వీట్ లు వేసారు. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఏ మూల కనిపిస్తుందా అని దుర్భిణీ వేసి చూసే మీడియా వెంటనే ఆయనను చంకన ఎత్తుకుంది. ఇంకేదో బ్రహ్మండం బద్దలైపోతుందని జ‌నం అంతా ఆర్జీవీని సోషల్ మీడియాలో ఫాలో కావడం మొదలు పెట్టారు.

మరి ఆర్జీవీ అడిగారో లేదా మంత్రి పేర్ని నానికి ఆర్జీవీని చూడాలని అనిపించిందో లేక నిజంగానే ఆయన దగ్గర విషయాలు తెలుసుకోవాలనుకున్నారో, పిలుపు అందింది. రాజువెడెల రవితేజ‌ము లలరగ అన్నట్లు చిరుగుల జీన్స్, ఎర్రటి హుడ్ షర్ట్, గోల్డెన్ షూస్ వేసుకుని మరీ వెళ్లారు ఆర్జీవీ. అక్కడ మంత్రి, అధికార బృందం సాదర స్వాగతం పలికారు. ఏం ముచ్చట్లు పెట్టుకున్నారో తెలియదు కానీ ఎవరి మాటలు వారు బయటకు మాట్లాడారు.

అంతా అయిపోయంది. టీ కప్పులో తుపాను అన్నట్లుగా, వడ్ల గింజ‌లో బియ్యపు గింజ‌ అన్నట్లుగా వ్యవహారం తేలిపోయింది. జ‌నం ఓస్ ఇంతేనా అనుకున్నారు. వైకపా వలలో వర్మ పడిపోయారోచ్ అంటూ తేదేపా మీడియా వాపోయంది.

తీరా వెనక్కు వచ్చిన తరువాత తన ఫ్రెండ్లీ మీడియాతో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ అసలు విషయం బయట పెట్టారు.

‘’ఓడ్కా తాగుతూ, అమ్మాయిల కాళ్ల దగ్గర పొర్లుతూ, వాళ్ల కాళ్లకు మొక్కుతూ వుండేవాళ్లకు విషయం లేదనుకుంటే సరి కాదని, తనకు. బోలెడు విషయం తెలుసు అని చెప్పడానికే ఇదంతా చేసానని’ ఆర్జీవీ వెల్లడించారు.

అంటే ఆర్జీవీ తన పరిజ్ఞానం వెల్లడించడానికే ఇదంతా చేసారన్నమాట. ఇంత తెలిసిన ఆర్జీవీకి విషయం కోర్డు పరిథిలో వుందని తెలియదా? లేదా కోర్టు ఆదేశాల మేరకు వేసిన కమిటీ ఒకటి వుందని తెలియదా? తాను మంత్రి కలిసి భేటీ వేసినంత మాత్రాన ఒరిగేది ఏదీ లేదని తెలియదా? కేవలం తన పటాటోప ప్రదర్శనకు, తన పబ్లిసిటీ కోసం తప్ప ఇది దేనికి అన్నది ఇంకా అర్థం కావడం లేదా జ‌నాలకు?

గమ్మత్తేమిటంటే మళ్లీ తెల్లారుతూనే మొదలుపెట్టేసారు. మహరాష్ట్రలో ఆర్ఆర్ఆర్ కు అంత రేట్లు, కర్నాటకలో ఇంత రేట్లు, ఆంధ్రలో మాత్రం సినిమాను చంపేస్తున్నారు అంటూ.

ఇప్పుడు చెప్పండి మంత్రిగారూ..ఆర్జీవీని ఆహ్వానించి మీరు సాధించిందేమిటి? మీ దగ్గరకు వచ్చి ఆర్జీవీ సాధించిందేమిటి? ఈ వ్యవహారాన్ని ఫాలో ఫాలో అంటూన్న మీడియాకు ఒరిగిందేమిటి?