భార్యల మార్పిడి.. టెలిగ్రామ్ వేదికగా నయా దందా

శృంగారంలో కొత్తదనం కోరుకునే కామాంధులు కొందరు ఏకంగా తమ భార్యల్నే మార్పిడి చేసుకునే వ్యవహారం కేరళలో వెలుగుచూసింది. తమ సెక్స్ కోరికల కోసం భార్యల్ని మరో వ్యక్తి దగ్గరకు పంపించి, అతడి భార్యతో ఎంజాయ్…

శృంగారంలో కొత్తదనం కోరుకునే కామాంధులు కొందరు ఏకంగా తమ భార్యల్నే మార్పిడి చేసుకునే వ్యవహారం కేరళలో వెలుగుచూసింది. తమ సెక్స్ కోరికల కోసం భార్యల్ని మరో వ్యక్తి దగ్గరకు పంపించి, అతడి భార్యతో ఎంజాయ్ చేసే దందాను పోలీసులు గుర్తించారు. వైఫ్-స్వాపింగ్ గా పిలిచే ఈ అరాచకం, ఓ మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తన భర్త తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసుల దృష్టిలో ఇది చాలా చిన్న కేసు కావడంతో దాన్ని పట్టించుకోలేదు. కానీ కంప్లయింట్ రాసేకొద్దీ ఆమె చెప్పిన వివరాలు విన్న తర్వాత పోలీసులకే దిమ్మ తిరిగింది.

ఇవి గృహ హింస వేధింపులు కావు. వెళ్లి మరో వ్యక్తితో పడక పంచుకోమని వేధించిన వైనం. దీంతో పోలీసులు ఆ భర్తను అరెస్ట్ చేశారు. అయితే అక్కడితో కథ ముగియలేదు. అతడు చెప్పిన వివరాలు మరింత దిగ్భ్రాంతికి గురిచేశాయి. తనలానే మరో ఆరుగురు ఉన్నారని అతడు చెప్పాడు. పోలీసులు ఆ ఆరుగుర్ని కూడా అరెస్ట్ చేశారు.

వాళ్లు చెప్పిన సమాచారం విన్న తర్వాత ఇదంతా ఓ పెద్ద నెట్ వర్క్ అనే విషయాన్ని పోలీసులు తెలుసుకొని అవాక్కయ్యారు. దాదాపు వెయ్యి మంది సభ్యులతో టెలిగ్రామ్, మెసెంజర్ లో గ్రూపులు ఏర్పడ్డాయి. కోరిక కలిగిన ప్రతిసారి గ్రూపులో మెసేజ్ చేస్తారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఓకే చెబుతారు. వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులు తమ భార్యల్ని మార్చుకొని ఎంజాయ్ చేస్తారన్నమాట.

ఇటు భర్తలు, అటు భార్యల అంగీకారంతో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది ఈ దందా. అయితే ఓ మహిళ మాత్రం ఎదురు తిరిగింది. భర్త కాకుండా, మరో వ్యక్తితో మంచం పంచుకోవడానికి అంగీకరించలేదు. భర్త మాత్రం తగ్గేదేలే అన్నాడు. దీంతో భార్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. మొత్తం వ్యవహారం బయటపడింది.

కేరళలోని 3 జిల్లాలకు చెందిన దాదాపు వెయ్యికి పైగా జంటలు ఈ అశ్లీల దందాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీళ్లలో ఉన్నతస్థాయి వ్యక్తులు, డబ్బున్నోళ్లు, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు, వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికి 25 మందిని విచారిస్తున్నారు. కేరళలో వెలుగులోకొచ్చిన ఈ కేసు, ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.