ఇప్పటికే జగనన్న కాలనీలు అని మొదలు పెట్టారు, ఇంకా ఇళ్ల నిర్మాణం ముందుగు సాగలేదు, ఓ కొలిక్కి రావడానికి మరికొన్నాళ్లు సమయం పడుతుంది. ఇప్పుడు మిడిల్ ఇన్ కమ్ గ్రూప్స్ వారికి సంక్రాంతికి అట్టహాసంగా ఎంఐజీ లే అవుట్స్ అంటున్నారు.
వీటి వల్ల ఉపయోగం ఎంత..? వచ్చే ఎన్నికలనాటికి కనీసం ఒక్క ఇంటిలో అయినా గృహ ప్రవేశం జరుగుతుందా..? జరిగితేనే అది జగన్ కి మంచిది, లేకపోతే ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్న అపప్రధ మోయాల్సి వస్తుంది. ఎన్నికల ప్రచారంలో అదే ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రం అవుతుంది. గతంలో చంద్రబాబు చేసిన తప్పే జగన్ చేసినట్టవుతుంది.
జగన్ ముందు చూపు..
పేద, మధ్యతరగతి.. ఇలా ఎవరికైనా సొంతిల్లు అనేది ఓ కల, కొందరికి అది జీవితాశయం కూడా. భారీగా పెరిగిపోతున్న స్థలాల రేట్లు, నిర్మాణ ఖర్చుల నేపథ్యంలో ఈ కల చాలామందికి సుదూర స్వప్నంగానే కనిపిస్తోంది. అలాంటిది జగన్ చిన్నదో, పెద్దదో ముందుగా సొంత స్థలం అంటూ ఒకటి ఉంటే చాలనుకునేవారికి జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
ఇల్లు కట్టినా, కట్టకపోయినా ఆ స్థలం వారిది అనే భరోసా ఉంటుంది. సో.. అక్కడికి ఓ స్థిరాస్థి పేదలకు జమ అయినట్టే. ఇప్పుడిక మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ పై దృష్టిపెట్టారు జగన్.
ఉభయకుశలో పరి..
ఎంఐజీ లేఅవుట్స్ వల్ల అటు మధ్య ఆదాయ వర్గాలతో పాటు, ఇటు ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. పక్కా లే అవుట్లు పట్టణాల్లో దొరకడం కష్టం. ఇక్కడ ప్రభుత్వమే వీటిని సరసమైన ధరలకు అందుబాటులోకి తెస్తోంది.
అభివృద్ధి చేసి ఇస్తోంది. దీంతో సహజంగానే వీటికి డిమాండ్ ఉంటోంది. దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుంది. అందుకే జగన్ ఈ వైపుగా ఆలోచించారు. అన్నీ పేదవారికేనా అని బాధపడుతున్న మధ్యతరగతి ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ టౌన్ షిప్ ల ద్వారా ఆసరా ఇవ్వబోతున్నారు.
బాబు తప్పులే జగన్ కి పాఠాలు..
చంద్రబాబు చేసిన తప్పుల్ని చూసి జగన్ కొత్త పాఠాలు నేర్చుకున్నట్టు అయింది. హడావిడిగా అపార్ట్ మెంట్లు నిర్మించి, పేదవారి నెత్తిన అప్పుల భారం మోపి, తప్పులు చేసి తిప్పలు పడ్డారు బాబు. కానీ జగన్ నేరుగా ఇంటి స్థలాలే అప్పగిస్తున్నారు.
ఇల్లు లేకపోయినా స్థలం ఉందనే ధీమా చాలా గొప్పది. ఆ ధీమాని అటు పేద, ఇటు మధ్యతరగతి ప్రజలకు ఇస్తున్నారు జగన్. ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది. ఇంతవరకు ఓకే కానీ.. ఇళ్ల నిర్మాణం విషయంలో మాత్రం జగన్ ఆచితూచి అడుగులేస్తే మంచిది.