సత్యరాజ్ కు కరోనా సోకిన మాట వాస్తవం. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ చేసిన మాట నిజం. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ నిన్నట్నుంచి వస్తున్న కథనాల్లో మాత్రం నిజం లేదు. అవన్నీ పూర్తిగా పుకార్లు.
అవును.. సత్యరాజ్ ఆరోగ్యంగానే ఉన్నారు. పూర్తిగా కరోనా నుంచి కోలుకోనప్పటికీ ఆయన ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉంది. అంతేకాదు.. వైద్యులు ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో వారం రోజులు ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటే సరిపోతుందని సూచించారు.
గత శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు సత్యరాజ్. ఒళ్లు నొప్పులతో పాటు తీవ్రమైన జ్వరం రావడంతో హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు. అప్పట్నుంచి 3 రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉన్న సత్యరాజ్ పై చాలా పుకార్లు చెలరేగాయి. హాస్పిటల్ యాజమాన్యం కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంలో జాప్యం చేయడంతో రూమర్లు మరింత ఎక్కువయ్యాయి.
ఎట్టకేలకు ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు సత్యరాజ్. వారం రోజుల పాటు ఐసొలేషన్ లో ఉన్న తర్వాత మరోసారి కరోనా పరీక్ష నిర్వహించి నెగెటివ్ వచ్చిన తర్వాత బయట అడుగు పెట్టబోతున్నారు. ప్రస్తుతం తెలుగు-తమిళ భాషల్లో 10కి పైగా సినిమాల్లో నటిస్తున్నారు సత్యరాజ్.