స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, దాని అనుబంధ మీడియా సాక్షి సరికొత్త వాదనకు దిగారు.
“ఈ సమయంలో ఎన్నికలా?” అంటూ సాక్షి తన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ వార్తా కథనాన్ని వండి వార్చింది. రోజూ వేలాది కరోనా కేసులు నమోదవుతున్నాయని, యూరప్ దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించారని, అలాగే మన దేశంలోనూ సెకండ్ వేవ్ భయాందోళనలు నెలకున్నాయని, అయినా ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామనడం ఏంటని నిమ్మగడ్డ వైఖరిని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ సాక్షిలో ఓ కథనాన్ని రాశారు.
ఇందులో రాసినవన్నీ నిజాలే. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులను తమ ఇష్టానుసారం అన్వయించుకోవడమే విమర్శలకు దారి తీస్తోంది. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. అది నిమ్మగడ్డైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా …వ్యక్తులు, వ్యవస్థలు ఎవరు, ఏవనేది పక్కన పెడితే … ప్రజల ప్రాణాలను కాపాడడమే అంతిమ లక్ష్యంగా పని చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం తమకు అవసరం వచ్చిన విషయాల్లో మాత్రం అంతా నిబంధనల ప్రకారం చేసుకెళుతున్నట్టు గొప్పలు చెబుతుండడం తెలిసిందే.
మరోవైపు విద్యా సంస్థలను ప్రారంభించడంపై విమర్శలను ప్రభుత్వం లెక్క చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రం కోవిడ్ నిబంధనలన్నింటిని పాటిస్తూ అని తమను తాము సమర్థించుకోవడం సబబేనా? ఇప్పటికే దాదాపు లాక్‌డౌన్ అంటూ ఏదీ లేకుండా అన్నీ తెరుచుకున్నాయి.
కానీ విద్యార్థులకు సంబంధించి కాస్తా సంయమనం పాటించాలని పలువురు సూచిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఖాతరు చేయకుండా తాననుకున్నది చేస్తూ పోతోంది.
ఇదే స్థానిక సంస్థల ఎన్నికల విషయం వచ్చేసరికి కరోనా ఉధృతి, యూరప్ దేశాల్లో లాక్‌డౌన్ తదితర విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకొస్తున్నాయి. ఒక వాదన తెర మీదకు తెస్తున్నప్పుడు ప్రజల ఆదరణ ఏ మేరకు ఉందో ఒక్కసారి ఆలో చించాలి. నిమ్మగడ్డ వైఖరిని తప్పు పట్టే వాళ్లు కూడా …మరి ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే కదా? అనే ప్రశ్న వేస్తున్నారు.
సహజంగానే తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేసీఆర్ సర్కార్ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో జగన్ సర్కార్‌పై తప్పక ఒత్తిడి పెంచుతుంది. మరోవైపు బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో జగన్ సర్కార్ వాదన తర్కానికి నిలబడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.