cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మిస్‍ ఇండియా

సినిమా రివ్యూ: మిస్‍ ఇండియా

సమీక్ష: మిస్‍ ఇండియా
రేటింగ్‍: 2/5
బ్యానర్‍: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్
తారాగణం: కీర్తి సురేష్‍, జగపతిబాబు, రాజేందప్రసాద్‍, నరేష్‍, నవీన్‍ చంద్ర, సుమంత్‍ శైలేంద్ర, కమల్‍ కామరాజు, ప్రవీణ్‍, పూజిత పొన్నాడ, దివ్య శ్రీపాద తదితరులు
రచన: నరేంద్రనాధ్‍, తరుణ్‍ కుమార్‍
సంగీతం: తమన్‍
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: సుజీత్‍ వాసుదేవ్‍
నిర్మాత: మహేష్‍ ఎస్‍. కోనేరు
దర్శకత్వం: నరేంద్రనాధ్‍
విడుదల తేదీ: నవంబరు 4, 2020
వేదిక: నెట్‍ఫ్లిక్స్

‘మహానటి’ తర్వాత స్ట్రెయిట్‍ తెలుగు సినిమా చేయడానికి చాలా కాలం వేచి చూసిన కీర్తి సురేష్‍ ‘మిస్‍ ఇండియా’ చిత్రాన్ని ఎంచుకుందంటే ఇందులో నిజంగా అంత గొప్పతనం వుంటుందని చాలా మంది భావించి వుండొచ్చు. కానీ సినిమాపై పెట్టుకున్న నమ్మకం కోల్పోవడానికి ‘మిస్‍ ఇండియా’ టీ కాచినంత సమయం కూడా తీసుకోదు. 

ఫస్ట్ షాట్‍లోనే తాను అనుకున్న లక్ష్యం చేరిపోయిందని చూపించిన మానస సంయుక్త (కీర్తి సురేష్‍) తన కథను తన చిన్నప్పట్నుంచీ మనకు చూపిస్తుంది. మొదటి సీన్లోనే మన బుల్లి మానసతో నువ్వు అబద్ధం చెబుతున్నపుడు నీ కాళ్లను చూస్తావు అని వాళ్లమ్మ (నదియా) అంటే అదేదో ప్లాట్‍ పాయింట్‍ అనిపిస్తుంది. కానీ అది కళ్లు, కాళ్లు అనే ప్రాస కోసం రైటర్‍ పడ్డ ప్రయాస అని తర్వాత బోధపడుతుంది. ఫస్ట్ ర్యాంక్‍ వచ్చిన కూతురిని మెచ్చుకోకుండా ‘నీకు లైఫ్‍లో ఏ గోల్‍ లేనపుడు ఫస్ట్ ర్యాంక్‍ వచ్చినా ఉపయోగం లేదు’ అని ఆమె తండ్రి అనగానే ‘ఎలాగెలాగ’ అని అడగాలనిపిస్తుంది. 

చిన్నప్పుడే బిజినెస్‍వుమన్‍ అవ్వాలని డిసైడ్‍ అయిన మానసను అడుగడుగునా డిస్కరేజ్‍ చేస్తుంటారంతా. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి తన ఇంట్లో కొన్ని అసందర్భ, అర్థరహిత సంఘటనలు, కొన్ని అనుకూల, కథకు అనువైన సంగతులు వరుసగా జరిగిపోతాయి. సడన్‍గా ఆమె తండ్రికి (నరేష్‍) అల్జయ్‍మర్స్ వస్తుంది. ఆమె సోదరి చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చి అట్నుంచటే వెళ్లిపోతుంది. ఆమె అన్నయ్యకు (కమల్‍ కామరాజు) ఎంటెక్‍లో ర్యాంకొచ్చి యుఎస్‍లో ఉద్యోగం కూడా వస్తుంది. చదువుల కోసం పల్లెలు దాటి పట్నాలకొచ్చి, ఇప్పుడు ఉద్యోగాల కోసం దేశం దాటి విదేశాలకు వెళ్లిపోతారా అని మానస యుఎస్‍ షిఫ్టింగ్‍కి అడ్డుపడబోయిన తాతయ్య (రాజేందప్రసాద్‍) గుండె లక్కీగా ఆగిపోతుంది. దాంతో మానస యుఎస్‍లో దిగుతుంది.  

మానస తాతయ్య ఆయుర్వేదం డాక్టరు ప్లస్‍ టీ ఎక్స్పర్టు. ఆయన తన పేషెంట్లకు ఆయుర్వేదం టీ ఇచ్చి రోగం నయం చేసేస్తుంటాడు. తాతయ్య నుంచి తేనీరు ఎలా కాయాలో నేర్చుకున్న మానస తాతయ్యను ఎలాగయినా పాపులర్‍ చేస్తానని మాటిస్తుంది కానీ నిజంగా ఆ బిజినెస్‍లోకి దిగాక ఎక్కడా తాతయ్య పేరెత్తదు.. అది వేరే సంగతి. యుఎస్‍లో దిగిన మానసకు అక్కడ ‘చాయ్‍’ దొరకదనే కాఫీ లాంటి చేదు నిజం తెలుస్తుంది. కానీ ‘కాఫీ ఈజ్‍ నాట్‍ హర్‍ కప్‍ ఆఫ్‍ టీ’ కాబట్టి చాయ్‍ బిజినెస్‍ స్టార్ట్ చేయాలని డిసైడ్‍ చేసుకుంటుంది. 

మామూలుగా అయితే ఇలాంటి స్టార్టప్‍ కంపెనీని ఆ ప్రోడక్ట్కి అంతగా ప్రాచుర్యం లేని ప్రదేశంలో పెట్టాలంటే తాతలు దిగి రావాలి. కాకపోతే మానసకు తాతయ్య టీ గుర్తు రావడానికి కాస్త టైమ్‍ పడుతుంది. మామూలుగా అయితే బిజినెస్‍లో రాణించాలనే తన జీవిత లక్ష్యానికి ఆమె సరాసరి బిజినెస్‍ మొదలు పెట్టడానికి దారులు అన్వేషించాలి. కానీ అది ఇంటర్వెల్‍ బ్యాంగ్‍ అని ఫిక్స్ అయ్యారు కనుక అందాక ఆమె ఉద్యోగం చేయడం, ఆమెనో వ్యక్తి (నవీన్‍ చంద్ర) ప్రేమించడం... తర్వాత తనను ప్రేమించినవాడు వదిలేసి వెళ్లడం, ఇంట్లోంచి అమ్మ-అన్న బయటకు వెళ్లగొట్టడం, రిస్కే తప్ప రిటర్న్ వుండదనే భయంతో స్నేహితురాళ్లు (దివ్య, పూజిత) తోడుండకుండా వెళ్లిపోవడం అలా జరిగిపోతాయి. 

చిన్న టీ కొట్టు పెట్టుకుంటే పోలీసులు అడ్డు పడడంతో జాగా కోసం చూస్తూ కాఫీ బిజినెస్‍ టైకూన్‍ కైలాష్‍ (జగపతిబాబు) దగ్గరకు వెళ్లి అతడి కాఫీ ఎంపైర్‍లో తన టీకి కాస్త చోటిమ్మంటుంది. ఒక సిల్లీ సీన్‍తో ఇంట్రడ్యూస్‍ అయిన సదరు కాఫీ కింగ్‍కి వెనక ఒకడు అటు ఇటు తిరుగుతూ ఇచ్చే బిల్డప్‍ చూస్తే ఇన్‍ఫ్రంట్‍ క్రొకడైల్‍ ఫెస్టివల్‍ అనే చిరంజీవి డైలాగ్‍ గుర్తొస్తుంది. అన్నట్టు... చిరంజీవి ఛాలెంజ్‍లో విలన్‍ తనను ఛాలెంజ్‍ చేస్తూ రూపాయి ఇస్తే... ఇక్కడ మానసను ఛాలెంజ్‍ చేస్తూ మన కాఫీ సుల్తాన్‍ రిచ్‍గా వెయ్యి డాలర్లిస్తాడు. 

అది పెట్టుబడిగా పెట్టి ఆమె ఓ చాయ్‍ సెరిమనీ ఏర్పాటు చేయడం, ఇల్లిల్లూ తిరుగుతూ పాంప్లెట్లు పంచిపెట్టిన ఆ ఈవెంట్‍కు ఓ పెద్ద బిజినెస్‍మాన్‍ (సుమంత్‍ శైలేంద్ర) రావడం, అతడిని వెళ్లి మానస ఇన్వెస్ట్మెంట్‍ అడగడం, అతడో స్టుపిడ్‍ అగ్రిమెంట్‍ చేసుకోవడం... మానస టీ కొట్టు చాలా త్వరగా ఒక ఫ్రాంఛైజ్‍ అవ్వడం, అది మన కాఫీ నవాబ్‍కు కంగారు పుట్టించడం... కాఫీ వర్సెస్‍ టీ యుద్ధంలో ఎత్తులు పై ఎత్తులు, జిత్తులు, తప్పనిసరి ట్విస్టులు, వగైరా వగైరా తర్వాత ఆమె రాణి అవడం, అతడు రోడ్డున పడడంతో మిస్‍ ఇండియా ముగిస్తుంది. అంతలోగా అలర్ట్గా వుండడానికి, ఎనర్జీ తెచ్చుకోడానికీ, ఫైనల్‍గా తలనొప్పి తట్టుకోడానికీ పలుమార్లు టీ అవసరం పడుతుంది. ఓటిటి రిలీజ్‍ కాబట్టి ఎవరింట్లో వారికి టీ పెట్టుకుని తాగే సౌకర్యం వుంటుంది. ఒకవేళ థియేటర్లో అయి వుంటే టికెట్ల సంగతేమో కానీ క్యాంటీన్‍లో టీ సేల్స్ అయితే బ్రహ్మాండంగా వుండుండేవి. 

కథ మొదటి ఘట్టంలోనే ఈ చిత్రంలోని ఏ సంభాషణను, సన్నివేశాన్ని సీరియస్‍గా తీసుకోవద్దనే హింట్స్ బలంగా అందుతుంటాయి. విలన్‍ని ఛాలెంజ్‍ చేసి అతడిని రోడ్డుకి లాగి ఎప్పుడూ హీరోనే హీరో అవ్వాలా... హీరోయిన్‍ అలా హీరో అవకూడదా అనే ఆలోచనలోంచి పుట్టిన కథో లేక ఒక స్ట్రాంగ్‍ వుమన్‍ క్యారెక్టర్‍ను చూపిద్దామని మొదలు పెడితే చాయ్‍ గ్లాసు కమర్షియల్‍ ఛట్రంలో పడి ఇలా పగిలిపోయిందో తెలీదు కానీ అతి సాధారణ మాస్‍ మసాలా సినిమాల్లో కూడా ఇందులో వున్నంత ఇన్సెన్సిబులిటీ, స్టుపిడిటీ వుండవు. టీ బిజినెస్‍ మొదలు పెట్టిన కొన్ని సీన్ల తర్వాత కోట్లకు అధిపతి అయిన విలన్‍ కంగారు పడిపోతే హీరోయిన్‍ ఎంతెత్తుకి ఎదిగిపోయిందో అని ఫీలవుతాం. 

రెండేళ్లలో తాను సాధించినది రెండు నెలల్లోనే సాధించేసిందని సరాసరి విలనే ఆమె టీ కెఫేకి వచ్చి బ్యాంక్‍ చెక్‍ ప్లస్‍ పార్టనర్‍షిప్‍ ఆఫర్‍ చేస్తే అప్పటికో వెయ్యి కోట్లు వెనకేసేసి వుంటుందేమో అనుకుంటాం. కట్‍ చేస్తే... అప్పటికి ఆమె ఫ్రాంచైజీ ప్రాఫిట్‍ పది శాతం కూడా వుండదు. అంటే రఫ్‍గా ముప్పయ్‍ లక్షలు కూడా కాదన్నమాట. దానికే విలన్‍ అల్లకల్లోలం అయిపోయాడంటే ఆమె లాభం సంగతటుంచి అతడి టర్నోవర్‍ బాగా తక్కువేమో అని డౌటొస్తుంది. ఆరు నెలల్లో ఎదిగిన హీరోయిన్‍ ఆ తర్వాత మూడు నెలల్లో జీరోకి పడిపోవడం, మళ్లీ ఆ తర్వాతి మూడు నెలల్లో సూపర్‍ హీరో అయిపోవడం ఫార్ములానే కావచ్చు కానీ ఆ తంతు మాత్రం కీర్తి సురేష్‍ స్క్రిప్ట్ జడ్జిమెంట్‍పై ‘పెంగ్విన్‍’ రేపిన అనుమానాలను పదింతలు చేస్తుంది. 

స్వప్నం, లక్ష్యం, శిఖరం, పతనం... లాంటి ట్రెయిట్స్ చూసి ఈ కథ కూడా మహానటి మాదిరి మాయాజాలం చేయగలదని భావించిందేమో కానీ అదృష్టం కలిసొచ్చి మరోసారి థియేటర్లను స్కిప్‍ చేసి ఎస్కేప్‍ కాగలిగింది. హీరోయిన్లకు ఇలాంటి మాస్‍ సినిమాల్లో విలన్‍ని ఛాలెంజ్‍ చేసే ఛాన్స్ దొరకదు. ‘తాతకు ప్రేమతో’ అంటూ జగపతిబాబుని ఎన్టీఆర్‍లా హీరోయిన్‍ ఎదుర్కొంటే ఎలా వుంటుందనేది కీర్తి ఈ సినిమాతో ఎక్స్పీరియన్స్ చేయగలిగింది.

ఆమె కాన్ఫిడెంట్‍ పర్‍ఫార్మెన్స్, స్టయిలింగ్‍ ఈ చిత్రానికి ప్లస్‍ అయినా కానీ ఈ కొత్త స్లిమ్‍ లుక్‍లో కొన్ని షాట్స్లో పేల్‍గా కనిపించడం ఒకింత డిజప్పాయింట్‍ చేస్తుంది. జగపతిబాబు ఇంట్రడక్షన్‍ సీనే కామెడీగా అనిపిస్తే, లాస్ట్ సీన్‍తో దానికి మించిన కామెడీ చేయడానికి రచయితలు చేసిన సిన్సియర్‍ కృషి తెలుస్తుంది. నరేష్‍కి ఎందుకని అల్జయిమర్స్ జబ్బు పెట్టారనేది మిలియన్‍ డాలర్ల ప్రశ్నే అయినా... కీర్తి సురేష్‍ అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత టెంపరరీగా అయినా అలాంటిదేదో వచ్చి దీనిని మెమరీ నుంచి ఎరేజ్‍ చేసేయాలనుకునే అవకాశమయితే వుంది. 

తమన్‍ నేపథ్య సంగీతం ఒక్కటీ మిస్‍ ఇండియాకు సంబంధించి బెస్ట్ యాస్పెక్టు. సన్నివేశాలు చూసి నీరుగారి పోకుండా తన ఉనికి తెలిసేలా తమన్‍ కృషి చేసాడు. దర్శకుడు తెరపై చూపించిన ప్రతిభ కంటే ఈ కథనంతో నిర్మాతను కన్విన్స్ చేసి, మంచి నటులకు కాన్ఫిడెన్స్ కలిగించాడనే నిజం అబ్బురపరుస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టు నిర్మాణ పరంగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేసిన ధైర్యం ఓటిటి రిలీజ్‍ రూపంలో పే చేసినట్టుంది. నెట్‍ఫ్లిక్స్ సబ్‍స్క్రిప్షన్‍ వుంది కనుక, కొత్త కాంటెంట్‍ పరంగా మరో ఆప్షన్‍ లేదు కనుక చూడక తప్పదనుకుంటే... మీకో ప్రో టిప్‍. ప్లే బటన్‍ నొక్కడానికే ముందే ఫ్లాస్కు నిండా టీ పోసుకుని సోఫా పక్కన పెట్టుకోండి. 

బాటమ్‍ లైన్‍: రంగు, రుచి, చిక్కదనం లేని టీ! 

- గణేష్‍ రావూరి 

 


×