ఇవాళ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. పై ప్రశ్నకు సమాధానం ఓ పట్టాన తెలియదు. వాళ్ల ఎన్నికల విధానం చాలా కాంప్లికేటెడ్‌గా వుంటుంది. గత ఎన్నికలప్పుడు విపులంగా రాశాను. హిల్లరీ క్లింటన్‌కు ట్రంప్ కంటె ఎక్కువ ఓట్లు వచ్చినా ఆమె నెగ్గలేదు. ఎలక్టొరల్ కాలేజీ సిస్టమ్ ప్రకారం ట్రంప్ నెగ్గాడు. ఇప్పుడేమౌతుంది? సాధారణ భారతీయులుగా ట్రంప్ ఓడిపోవాలని మనం అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే భారతీయులను తరిమివేసి, వాళ్లను రానీయకుండా అనేక అడ్డంకులు కల్పించి, వాళ్ల ఉద్యోగాలు ఊడపీకి అమెరికన్లకు యిస్తానంటున్న ట్రంప్ అంటే మనకు ఏవగింపు తప్ప మరేమి వుంటుంది?
మనవాళ్ల ఉద్యోగాల సంగతి సరే, ట్రంప్ పదవిలోకి వచ్చిన దగ్గర్నుంచి అమెరికా అధ్యక్ష పదవికి వున్న పరువు ప్రతిష్ఠ మంటగలిపేలా ప్రవర్తించాడు. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. నోటి దురుసుతనం ఎక్కువ. అవతలివాళ్లపై అబద్ధపు ఆరోపణలు చేయడానికి వెరవడు. తనతో పనిచేసిన వాళ్లతోనే తగాదాలు పెట్టుకున్నాడు. పదవిలోకి వచ్చేముందు, అమెరికా యితర దేశాల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటోందని, దానివలన సైనికులను, అధికమొత్తంలో ధనాన్ని పోగొట్టుకుంటోందని, వాటి నుంచి తప్పుకుని, ఆ శక్తియుక్తులను అమెరికాలో ఉద్యోగకల్పనకై వినియోగిస్తాననీ చెప్పాడు. మంచిదే కదా అనుకున్నాం.
కానీ పదవిలోకి వచ్చాక, అంతకు ముందున్న అమెరికా యొక్క అహంకారపూరిత విధానాలనే కొనసాగించాడు. ఇతర దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మానలేదు. పైగా ప్రతి దేశంతోనూ వైరం పెట్టుకున్నాడు. చైనాతో, ఇరాన్‌తో, రష్యాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వాడు. చైనా మీద ఆధారపడుతూనే వాళ్లని చితక్కొట్టేస్తానని ప్రగల్భాలు పలికాడు. భారత్‌తో సహా అనేక దేశాలపై తన అహంకారాన్ని, తూష్ణీంభావాన్ని ప్రదర్శించాడు. అందువలన ప్రపంచమంతా అతన్ని ఓ విలన్‌గా, ఓ జోకర్‌గా చూసింది. అమెరికాలో కూడా మీడియా అతనిపై ఎన్నో కార్టూన్లు వేసింది. ఘోరంగా విమర్శించింది. అతనితో బాటు పనిచేసి బయటకు వచ్చిన వాళ్లు అతన్ని తిట్టిపోశారు. అతని అభిమానులు సైతం అతన్ని జెంటిల్మన్ అని అనలేని పరిస్థితి. ఇదంతా కరోనా రాకముందు పరిస్థితి. ఇక కరోనా వచ్చిన తర్వాత అతని చేష్టలకు నవ్వుకోనివాళ్లు, తిట్టుకోనివాళ్లు లేరు. మరి అలాటి ట్రంప్ ఓడిపోవడం ఖచ్చితం అనుకోవాలి కదా.
కానీ అలా అనుకునే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ నెగ్గినా నెగ్గవచ్చంటున్నారు. ట్రంప్ ఒకవేళ నెగ్గితే ఫలితాలు పూర్తిగా వచ్చాక కారణాలేమిటనేది క్షుణ్ణంగా పరిశీలించాల్సి వుంటుంది. బైడెన్ నెగ్గితే అంత విశ్లేషణ అక్కరలేదు. ఎందుకంటే అతను ట్రంప్ కంటె 8 శాతం లీడ్‌లో వున్నాడు. ట్రంప్ తెంపరితనం ముందు బైడెన్ హుందాతనం కొట్టవచ్చినట్లు కనబడుతోంది. చివరకు బైడెన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చి, ట్రంప్‌కు గతంలోలా ఎలక్టొరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు పడవచ్చు. 7 స్వింగ్ రాష్ట్రాలలో ఓట్లే కీలకమని అందరికీ తెలుసు. అక్కడ ట్రంప్ క్రమంగా బైడెన్‌తో గ్యాప్ తగ్గించుకుంటూ వస్తున్నాడు.
ట్రంప్ గెలుస్తాడన్న శంకైనా ఎందుకు వస్తోంది అంటే కరోనాను అతను హేండిల్ చేసిన విధానం చూసి అందరం ఛీఛీ అంటున్నాం కదా, కానీ రిపబ్లికన్లలో 76 శాతం మంది భేషుగ్గా వుందంటున్నారుట. డెమెక్రాట్లలో కూడా 25 శాతం మంది బాగుందని అన్నారు, ఏప్రిల్ నెలలో! అక్టోబరు వచ్చేసరికి అది ఓ 10 శాతానికో పడిపోయింది. మొత్తం మీద 35 శాతం మంది అమెరికన్లు అతను కరోనాతో వ్యవహరించిన తీరును ఆమోదించారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో 96 లక్షల కరోనా కేసులు రావడం, వారిలో రమారమి 2.5 శాతం మంది, అంటే 2.37 లక్షల మంది మరణించిన తర్వాత కూడా యిలా అంటున్నారంటే ఆశ్చర్యంగా వుంది కదూ!
వాళ్ల వాదన ఏమిటంటే లాక్‌డౌన్ విధించిన దేశాలలోనూ కరోనా వ్యాపించింది, మరణాలు సంభవించాయి. పైగా ఆర్థికపరిస్థితి కుదేలైంది. లాక్‌డౌన్ విధించకపోవడం వలన అమెరికా అంత దారుణంగా దెబ్బ తినలేదు. అయినా దాన్నుంచి కోలుకోవడానికి అంటూ ట్రంప్ 2 ట్రిలియన్ డాలర్ల నిధులు విడుదల చేసి ప్రతీవారి ఖాతాలో 1000-1200 డాలర్లు డైరక్టుగా జమ చేసి, వారి కొనుగోలు శక్తిని పెంచాడు. అమెరికాలో పని చేయని అమెరికన్ కంపెనీ ఉద్యోగులకు కూడా ఆ డబ్బు చేరింది. ఎన్నికల తర్వాత రెండో ప్యాకేజీ కూడా యిస్తానంటున్నాడు. లాక్‌డౌన్ పెట్టకుండా ట్రంప్ మనను రక్షించాడని వాళ్ల భావంట. ట్రంప్ నిర్లక్ష్యధోరణి మనకు వింతగా వుంది కానీ సాధారణ అమెరికన్లకు బాగానే వుందని వార్తలు వస్తున్నాయి. మాస్కు పెట్టుకోకపోవడం నా హక్కు అని వాదించేవాళ్లూ చాలామంది వున్నారట. ట్రంప్‌దీ అలాటి మనస్తత్వమే కాబట్టి, వాళ్లు ట్రంప్‌లో తమను తాము చూసుకుంటున్నారేమో!
ట్రంప్ గెలిచినదే కెసియార్ మార్క్ ప్రాంతీయవాదం మీద! శ్వేతజాతీయుల అహంకారాన్ని, అభద్రతాభావాన్ని రెచ్చగొట్టి నెగ్గాడు. ఈ నాలుగేళ్లలో వాళ్ల ధోరణిలో మార్పేమైనా వచ్చిందా? ఉదారవాదులుగా మారిపోయారా? మీరూ నేనూ ఏమైనా అనుకోవచ్చు. వాళ్లు ట్రంప్‌ను చూసి సిగ్గుపడుతున్నారా? అతనికి బుద్ధి చెప్పాలని తాపత్రయ పడుతున్నారా? ఇవతల బైడెన్ చూస్తే 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం యిచ్చేస్తానంటున్నాడు. అది వాళ్లకు రుచించే విషయమా? ఇంకో మాట కూడా యిక్కడ అనుకోవాలి. అమెరికా వెళ్లి డాలర్లు నొల్లుకొద్దామనుకునే భారతీయులు ఆ పనికి అడ్డుపడుతున్నందుకు ట్రంప్‌పై కోపం పెంచుకుంటున్నారు కానీ అక్కడే స్థిరపడి పోయిన భారతీయులకు అలాటి కోపం వుండదు.
రైల్వే కంపార్టుమెంటాలిటీ అని ఒకటుంటుంది. అన్‌రిజర్వ్‌డ్ కంపార్టుమెంటులోకి ఎవరైనా ఎక్కుదామని చూస్తే అప్పటికే దానిలో వున్నవాళ్లు వాళ్లని ప్రతిఘటిస్తారు. లోపలికి రానీయకుండా తలుపు మూసేస్తారు. ఎవడైనా మొండివాడు బలవంతంగా చొరబడితే ఏం చేయలేక ఊరుకుంటారు. అతనితో చేతులు కలిపి తర్వాతి స్టేషన్‌లో ఎక్కబోయేవారిని అడ్డుకుంటారు. కొత్తగా వచ్చి చేరినవాడు, ముందు నుంచీ వున్న వాళ్ల కంటె మొరటుగా కొత్తవాళ్లను అడ్డుకుంటాడు. అందర్నీ రానిచ్చేస్తే తమకు చోటు తగ్గిపోతుందని భయం. అలాగే పరాయిదేశంలో ముందే వెళ్లి పాతుకుపోయిన వాళ్లు తమ దేశం నుంచి వచ్చిన కొత్తవాళ్లను ఎఱ్ఱ తివాచీ పరిచి ఆహ్వానించరు. తమకు పోటీ వస్తారని భయం.
యుకెలో బ్రెగ్జిట్‌పై రిఫరెండం పెట్టినపుడు అక్కడి పౌరసత్వం పొందిన భారతీయులు అధికసంఖ్యలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారని అక్కడి మిత్రులు చెప్పారు. అమెరికాలోనూ అదే పరిస్థితి వుండుంటుంది. భారతీయులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో డెమోక్రాట్లు ఉదారంగా వుంటారు కానీ భారతీయుల్లో చాలామంది రిపబ్లిక్ పార్టీ అభిమానులున్నారు. ఆ పార్టీకి ధారాళంగా విరాళాలిచ్చారు కూడా. ఈసారి డెమోక్రాట్లకు 2.5 కోట్ల డాలర్లు యిస్తే రిపబ్లికన్లకు కాస్త తక్కువగా 2 కోట్ల డాలర్లు యిచ్చారని చదివాను.
ఇక శ్వేతజాతీయుల అహంకారం గురించి చెప్పుకోవాలంటే – ట్రంప్ వాళ్లను బాగా రెచ్చగొట్టాడు. ఎందుకంటే నల్లవారిలో అధిక సంఖ్యాకులు డెమోక్రాటిక్ పార్టీ అభిమానులు. వారిని హేళన చేసి శ్వేతజాతీయులను మచ్చిక చేసుకున్నాడు. ఇటీవల ‘ఐ కాంట్ బ్రీత్’ ఉద్యమం పట్ల అతని ధోరణి ఏవగింపు కలిగించింది – మనకు! శ్వేతజాతీయులలో చాలామందికి కూడా కలిగించి వుంటే అది యీ ఎన్నికలలో ప్రతిఫలించాలి. ఆ దేశంలో శ్వేతజాతీయల జనాభా 65 శాతం అని మనం గుర్తుపెట్టుకోవాలి.
భారతీయులకు వర్ణవివక్షత గురించి భయం లేదా అంటే లేదనే అనుకోవాలి. ఎందుకంటే నల్లవారిలో కూడా పేదవర్గాల వారే అవమానాలు, ఛీత్కారాలు, దాడులు ఎదుర్కుంటూ వుంటారు. అక్కడున్న మన భారతీయులలో పేదవర్గాల వారు ఎవరూ లేరు. అందరూ ఉద్యోగస్తులూ, వ్యాపారస్తులూ, ధనికులూ. వీరితో ట్రంప్ స్నేహంగా వుంటాడు. ఓ పక్క భారతీయల యాసను, మురికిని, జీవనసరళిని ఎద్దేవా చేస్తూ సగటు అమెరికన్‌ను ఖుషామత్ చేస్తాడు. మరో పక్క తన దేశంలో వున్న భారతీయులను చంక నేసుకుంటాడు.
డెమోక్రాట్‌లు మతానికి అంత ప్రాధాన్యత యివ్వరు. ట్రంప్ క్రైస్తవానికి పెద్ద పీట వేస్తాడు. దానితో బాటు భారతీయుల ఓట్లు కావాలి కాబట్టి హిందూమతానికి తెగ ప్రాధాన్యత యిచ్చేస్తున్నాడు. ‘హిందూస్ ఫర్ ట్రంప్’, ‘శిఖ్స్ ఫర్ ట్రంప్’.. అంటూ ఓ 20 కమిటీలు వేసి ఒక్కో దాంట్లో 20 మంది భారతీయులకు స్థానం యిచ్చి వారి ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు. మొత్తం 25.52 కోట్ల మంది ఓటర్లలో భారతీయ ఓటర్లు 19 లక్షలు మాత్రమేట. కానీ వీరు గెలుపోటములను ప్రభావితం చేయగలరని నమ్మకం.
ప్రస్తుతం ఇండియాలో కూడా మతతత్వం, జాతీయవాదం బాగా పెరిగింది కాబట్టి, మోదీలో ట్రంప్ నిజమైన స్నేహితుణ్ని చూశాడు. పైగా అమెరికాలో గుజరాతీలు చాలా కీలకమైన వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బు గడించారు. మోదీ కారణంగా అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ పెరిగిందనే నమ్మకంతో ప్రవాస భారతీయులందరూ మోదీ భక్తులై పోయారు. అది గ్రహించి ట్రంప్ మోదీని మహా వాటేసుకున్నాడు. అమెరికాలో ‘‘హౌడీ మోడీ’’, ఇండియాలో ‘‘నమస్తే ట్రంప్’’ కార్యక్రమాల ద్వారా అక్కడి భారతీయులను ట్రంప్ ఆకట్టుకున్నాడు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్లో మానవహక్కులు హరించడం, సిఏఏలను డెమోక్రాట్లు తప్పు పట్టగా, ట్రంప్ కిమ్మనలేదు.
గతంలో అక్కడి భారతీయులలో చాలామంది డెమోక్రాట్లకే ఓటేస్తూ వుండేవారు. 2016 నుంచి రిపబ్లికన్లను కూడా బాగా ఆదరించసాగారు. ఇప్పుడు డెమోక్రాట్లకు ఓటేస్తామని అనేవారి సంఖ్య 54 శాతానికి తగ్గింది. 2016లో రిపబ్లికన్లకు 21 శాతం మంది ఓటేయగా, యీసారి 41 శాతం మంది వేస్తారని అంచనా.
ట్రంప్ అధికారంలోకి రావడానికి ముఖ్యకారణం – బయటివాళ్ల ఉద్యోగాలు లాక్కుని అమెరికన్లకే యిస్తానని ప్రామిస్ చేయడం! ఆ పనిలో అతను యింకా విజయం సాధించకపోవచ్చు కానీ వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ ఆ ప్రయత్నంలోనే వున్నాడని సగటు అమెరికన్ నిరుద్యోగి మెచ్చుకుంటాడు. ట్రంప్ చేస్తున్న సవరణలను ఎప్పటికప్పుడు కోర్టులు, డెమోక్రాట్లు అడ్డుకుంటున్నారు తప్ప లేకపోతే తమందరికి ఎప్పుడో ఉద్యోగాలు వచ్చేసేవని వారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ట్రంప్ వచ్చాక నిరుద్యోగిత తగ్గింది కూడా. ఇంతలో కరోనా వచ్చి ఉద్యోగాలు పోయాయి. తమకు మళ్లీ రావాలంటే ట్రంపే గతి అని వాళ్లు అనుకోవచ్చు. వీసా నిబంధనలు సరళతరం చేసి, బయటివాళ్లకు ఉద్యోగాలు యిప్పిస్తాననే బైడెన్ ఉదారవాదం వాళ్ల కెందుకు నచ్చుతుంది?
ఫలితాలు వస్తున్న కొద్దీ యిలాటి అంశాలపై గణాంకాలతో సహా విశ్లేషించేందుకు వీలుంటుంది.
ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
[email protected]