జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష పార్టీలు ఓ పథకం ప్రకారం దాడి చేస్తున్నాయి. జగన్ సర్కార్ అంటే విధ్వంసానికి, రద్దులకు ప్రతీకగా ఘాటైన విమర్శలు చేస్తుండడం తెలిసిందే.
ఈ ప్రభుత్వం దెబ్బకు పరిశ్రమలన్నీ వెనక్కి పోతున్నాయంటూ ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున నెగెటివ్ ప్రచారానికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రచారాలకు చెక్ పెట్టేలా ఏపీలో మూడు మెగా ప్రాజెక్టుల స్థాపనకు ఓ అంగీకారం కుదిరింది. ఇది జగన్ సర్కార్‌కు ఎంతో సానుకూలమైన వాతావరణమని చెప్పొచ్చు.
మరో వైపు ఇలాంటి ధోరణి జగన్ సర్కార్ నుంచి పెరగాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ఆదాయ వనరులు పెరిగితే తప్ప సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితి ఉండదు. అప్పు చేసి పప్పు కూడు అనే చందంగా సంక్షేమ పథకాల అమలుకు భారీగా అప్పులు తీసుకురావడం వల్ల, అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం అంగీకారం తెలిపింది. ఈ సమావేశం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగడం విశేషం. ఈ మూడు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుతో దాదాపు 37 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌లు తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సమక్షంలో అంగీకారానికి రావడం శుభపరిణామం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మంలం ఇనగలూరులో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్‌వేర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రెండు దశల్లో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
ఈ పరిశ్రమ వల్ల 10 వేల మందికి ఉపాధి దక్కనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఇదే కంపెనీ ముఖ్యమంత్రి వైఎస్ ప్రాతి నిథ్యం వహిస్తున్న పులివెందులలో మరో యూనిట్‌ను నెలకొల్పనుంది. అక్కడ రెండు వేల మందికి ఉపాధి లభించనుంది.
ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్–హైవే టైర్స్ సంస్థ తమ యూనిట్‌ను విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రూ.980 కోట్లు పెట్టుబడితో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.
అలాగే విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటి గ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదించారు. ఈ సంస్థ ఏకంగా రూ.14,634 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 24,990 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ఇదే చొరవతో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. తన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కార్యాచరణ ఒక్కటే మార్గం. కేవలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు.
తన ప్రభుత్వంపై ఉన్న అపోహలను కూడా ఇలాంటి చర్యల ద్వారా పోగొట్టు కునే అవకాశం జగన్ సర్కార్‌కు ఉంది. ఇటీవల పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సంబంధిత మంత్రి గౌతమ్‌రెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చిస్తుండడం తెలిసిందే. ఒక్కొక్కటిగా పరిశ్రమ పెట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం జగన్ సర్కార్‌కు తిరుగు ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.