కడప మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త కందుల శివానందరెడ్డి (73) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందారు.
కడపలో ప్రముఖ విద్యా సంస్థగా పేరొందిన కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీ అధినేతగా ఆయన సుపరిచితులు. అంతేకాదు, ముస్లిం మైనార్టీల ఆధిపత్యం ఉన్న కడప అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం.
కందుల శివానందరెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి కందుల ఓబులరెడ్డి కడప పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. తండ్రి వారసత్వంగా శివానందరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా కడప నగర ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారనే గుర్తింపు శివానందరెడ్డికి ఉంది.
వేసవి కాలంలో తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న కడప నగర ప్రజానీకానికి ఉచితంగా తాగునీటిని అందించిన ఘనత శివానందరెడ్డికే దక్కుతుంది. జిల్లాలో రాజశేఖరరెడ్డి వ్యతిరేకంగా వర్గంగా శివానందరెడ్డి కొనసాగేవారు. అయితే రాజశేఖరరెడ్డి మరణానంతరం కొంత కాలం వైసీపీలో శివానందరెడ్డి కొనసాగారు.
కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డిపై శివానందరెడ్డి తమ్ముడు రాజమోహన్‌రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో శివానందరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్న శివానందరెడ్డి ఆకస్మిక మృతి జిల్లా ప్రజలకు తీరని లోటని చెప్పొచ్చు. కాగా శివానందరెడ్డి తమ్ముడు , ప్రముఖ పారిశ్రామికవేత్త కందుల రాజమోహన్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.