స‌ర్కార్ బెదిరింపు…ఉద్యోగ‌మా? ఉద్య‌మ‌మా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై మాన‌స పుత్రిక ఎదురు తిరిగింది. ఎవ‌రో ప‌రాయి వాళ్లు తిరుగుబాటు చేసినా సీఎం పెద్ద‌గా ప‌ట్టించుకునే వాళ్లు కాదేమో! కానీ త‌న‌కు తానుగా కోరి ఏర్పాటు చేసిన గ్రామ‌, వార్డు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై మాన‌స పుత్రిక ఎదురు తిరిగింది. ఎవ‌రో ప‌రాయి వాళ్లు తిరుగుబాటు చేసినా సీఎం పెద్ద‌గా ప‌ట్టించుకునే వాళ్లు కాదేమో! కానీ త‌న‌కు తానుగా కోరి ఏర్పాటు చేసిన గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ, త‌న‌కే ఎదురు తిర‌గడాన్ని ఏపీ స‌ర్కార్ జీర్ణించుకోలేకపోతోంది. సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చిన ప్ర‌కారం రెండేళ్లు పూర్త‌యినా ప్రొబేష‌న్‌ను డిక్లేర్ చేయ‌క‌పోవ‌డం, అలాగే మిగిలిన అంద‌రి ఉద్యోగుల‌తో పాటు నూత‌న పీఆర్సీని అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో చాలా న‌ష్ట‌పోతామ‌నే ఆందోళ‌న స‌చివాల‌య ఉద్యోగుల్లో నెల‌కుంది.

మ‌రోవైపు త‌మ‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించి రేష‌న్‌కార్డు తొల‌గించార‌ని స‌చివాల‌య ఉద్యోగులు వాపోతున్నారు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు త‌మ కుటుంబ స‌భ్యులు నోచుకోలేక‌పోతున్నార‌ని వాపోతున్నారు. ఒక‌వైపు ప్రొబేష‌న్ డిక్లేర్ చేయ‌కపోవ‌డం, మ‌రోవైపు కుటుంబ స‌భ్యుల్ని కూడా ప్ర‌భుత్వ ల‌బ్ధికి దూరం చేయ‌డంపై స‌చివాల‌య ఉద్యోగులు మండి ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ఆందోళ‌న‌బాట ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

గ‌త రెండుమూడు రోజులుగా ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌ల‌ను ఏ మాత్రం లెక్క చేయ‌కుండా విధుల‌ను బ‌హిష్క‌రించి నిర‌స‌న‌బాట ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం దిగొచ్చి వారితో చ‌ర్చించింది. కానీ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గం చూప‌క‌పోగా, బెదిరింపుల‌కు దిగ‌డం ఈ చ‌ర్చ‌ల ప్ర‌త్యేక‌త‌. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో ఆ వ్య‌వ‌స్థ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ జైన్ స‌మావేశ‌మ‌య్యారు.

గ‌త మూడురోజులుగా స‌చివాల‌య ఉద్యోగులు చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మూడు రోజుల ప‌రిణామాలు త‌ప్పుదారిలో వెళ్తున్నాయ‌ని హెచ్చ‌రించారు. ఇంకా 30 ఏళ్ల పాటు ఉద్యోగాలు చేయాల్సి వుంటుంద‌ని గుర్తు చేశారు. మొద‌ట్లోనే ఇలాగైతే త‌ప్పుడు సంకేతాల్ని పంపిన‌ట్టు అవుతుంద‌న్నారు. మ‌రీ ముఖ్యంగా విధుల‌కు గైర్హాజ‌రై, అధికారిక గ్రూపుల నుంచి త‌ప్పుకుని, రోడ్ల‌పైకి వ‌చ్చి నినాదాలు చేయ‌డంలాంటివి ఉద్యోగుల‌కు చెల్ల‌వ‌న్నారు. మీరేమైనా రైతులు అనుకుంటున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం ప్ర‌భుత్వ ఉద్దేశాన్ని తెలియ‌జేస్తోంది.  

మీరు ఆశిస్తున్న‌వి కొంత వ‌ర‌కైనా జ‌ర‌గాలంటే మంచి వాతావ‌ర‌ణం నెల‌కొల్పాల‌ని స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఆయ‌న హిత‌వు చెప్పారు. మంచిగా అడిగితే సీఎం ఒక‌టికి రెండు రెండు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని బుజ్జ‌గించారు. త‌ల‌కు బులెట్ పెట్టి ఇవ్వాల‌ని కోరితే ఇచ్చేది కూడా ఇవ్వ‌ర‌ని ఆయ‌న ప్ర‌భుత్వం త‌ర‌పున‌ తేల్చి చెప్పారు. దీంతో స‌చివాల‌య ఉద్యోగులతో అజ‌య్ జైన్ భేటీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ‌ను బెదిరించ‌డానికి అధికారిక స‌మావేశం ఏర్పాటు చేశారా? అని స‌చివాల‌య ఉద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదెక్క‌డి న్యాయ‌మ‌ని వారు నిల‌దీస్తున్నారు.

చ‌ర్చ‌ల‌న్న త‌ర్వాత ప‌ట్టువిడుపులు ఉండాల‌ని, అలా కాకుండా కేవ‌లం బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌తో త‌మ‌ను గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌నే ఆవేద‌న వారి నుంచి వ్య‌క్త‌మ‌వుతుతోంది. మొత్తానికి విధుల్లోకి హాజ‌రు కాక‌పోతే, తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని నేరుగానే స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక పంపింది. ఇక ఉద్యోగ‌మా, ఉద్య‌మ‌మా అని తేల్చుకోవాల్సింది స‌చివాల‌య ఉద్యోగులే!