ప్రతిభగల హీరోకి సోకిన అతి పెద్ద జబ్బు

అస్థిత్వపోరాటం ప్రతి రంగంలోనూ ఉంటుంది. అయితే నమ్ముకున్న దారిలో ఉన్న ప్రతిభకి లోబడి కొందరు పోరాటాన్ని చేస్తుంటారు. కొందరు మాత్రం ఏదో ఒక రకంగా ఉనికిని చాటుకోవడానికే బతుకుతుంటారు. దానికి వీరు ఎంచుకునే మార్గం…

అస్థిత్వపోరాటం ప్రతి రంగంలోనూ ఉంటుంది. అయితే నమ్ముకున్న దారిలో ఉన్న ప్రతిభకి లోబడి కొందరు పోరాటాన్ని చేస్తుంటారు. కొందరు మాత్రం ఏదో ఒక రకంగా ఉనికిని చాటుకోవడానికే బతుకుతుంటారు. దానికి వీరు ఎంచుకునే మార్గం సోషల్ మీడియా. 

ఈ లిస్టులో చాలామంది ఉన్నారు.

సరైన సినిమా తీసి ఎన్నో ఎళ్లు దాటిపోయిన దర్శకుడు రామగోపాల్ వర్మ నిత్యం ట్విట్టర్లో ఎవర్నో ఒకరిని కెలుకుతూ కాలక్షేపం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. అదే క్రమంగా ఆయన జీవితమైపోయింది. ఒకప్పుడు మర్యాదస్తుడిగా ఉండే వర్మ ఇలా ఎందుకు తయారయ్యాడా అని ప్రశించుకుంటే జవాబు వచ్చేస్తుంది. ఫ్లాపులు తీస్తూ మర్యాదగా బతకడం వల్ల తనను ఎవరూ గుర్తించరు. ఒకవేళ రాజమౌళి రేంజులో హిట్ సినిమాలు తీస్తుంటే మర్యాదని కాపాడుకుంటూ బతకొచ్చు… చేస్తున్న పని కీర్తినిస్తుంది కనుక. కానీ అలా సినిమాలు తీసే సత్తా పోయినప్పుడు ఇక మిగిలింది కాంట్రవర్సీనే. అందుకే ఆయన ఆలోచనలు, వస్తున్న నిర్మాతలు, తీస్తున్న సినిమాలు అన్నీ ఆ బాపతులోనే ఉంటున్నాయి. ఆ పంథాలో తనకి వ్యాపారం సాగుతోంది కాబట్టి మర్యాదని పణంగా పెట్టి “నా ఇష్టం” అనుకుంటూ బతికేస్తున్నాడు.  అన్నిటికంటే మించి చేస్తున్న పనిని సమర్ధించుకునే తెలివుంది కనుక తన గత అభిమానుల్లో ఎందరో పెదవి విరుస్తున్నా తిరుగులేకుండా జీవిస్తున్నాడు.

అలాగే కమలహాసన్ ట్విట్టర్లో వివాదాస్పద ట్వీట్లతో మొదలుపెట్టి ఒక ప్రాంతీయ పార్టీని కూడా పెట్టి దిగ్విజయంగా ఎందరినో ముంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాత్రం ఆర్ధికంగా మునగకుండా బాగానే తెలాడని కొందరంటారు. ఏది ఏమైనా కమల్ కి నటుడిగా ముందరున్నంత గౌరవం ఇప్పుడు లేదు. చాలా మంది అనేక రాజకీయ కారణాల వల్ల డివైడైపోయారు. 

ప్రకాష్ రాజ్ కూడా అంతే. మోదీ ప్రభుత్వం మీద “జస్ట్ ఆస్కింగ్” అంటూ రకరకాల ట్వీట్స్ పెట్టి రాజకీయంగా ముందడుగు వేసి ఓటమి పాలయ్యి కూర్చున్నారు. అంతెందుకు అతి చిన్నదైన “మా” ఎన్నికలో కూడా తన సత్తా చాటలేక ఎంతటి రాజకీయశూన్యుడో నిరూపించుకున్నాడు. ఆయన అభిమానులు కూడా గతంలో లాగ అంటిపెట్టుకుని లేరు. తాను రాజకీయంగా కొందరిని విభేదిస్తున్నట్టే తనని కూడా విభేదిస్తున్న తన అభిమానులు కూడా ఉన్నారు. 

ఇక తాజాగా సిద్ధార్థ కూడా వీరిని చేరాడు. అయితే గీత దాటిన భాషలో అతి తెలివి ప్రదర్శించాడు. మళ్లీ ద్వంద్వార్థమేమీ లేదిందులో అని మరొక ట్వీట్ పెట్టడం చాలా అసహ్యకరంగా ఉంది. మంచి నటుడిగా, రచయితగా, చక్కగా పాడగల గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ షటిల్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ని “సటిల్ కాక్ చాంపియన్” అని సంబోధించడం బాధాకరం. అందులో వేరే అర్థం లేదని బుకాయించినా “కాక్” అనే పదాన్ని ప్రత్యేకం వాడనవసరంలేని సందర్భంలో కూడా వాడడం ఉద్దేశ్యపూర్వకమే అని ఇట్టే అర్థమౌతుంది. ఇంతా చేసి ఆమె చేసిన తప్పేమీ లేదు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో ట్వీట్ చేసింది. అంతోటి దానికి ఆమెపై ఆ రకమైన ట్వీట్ ఎందుకు? దీనిపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడం ప్రధాన పత్రికల్లో సిద్ధార్థ ఫోటొలు దర్శనమివ్వడం జరిగింది. అతనికి కావాల్సింది ఇదే అన్నట్టుంది. చాలా గ్యాప్ తర్వాత చేసిన “మహా సముద్రం” అనే సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో సిద్ధార్థకి ఏమీ తోచక ఈ మధ్య ఈ దారి తొక్కాడని పలువురంటున్నారు. అది నిజమేనేమో అనిపిస్తోంది. 

ఈ సోషల్ మీడియా జబ్బనేది తెలివికి తెగులు పట్టినప్పుడే మొదలవుతుంది. ఇది నిజంగా పెద్ద జబ్బు. జీవితాంతం వదలని జబ్బు. లీగల్ గా దొరక్కుండా జాగ్రత్తపడుతూ ప్రజల్లో ఏదో ఒక వర్గం వారి మనోభావాల్ని కించపరిచేలా ట్వీట్లు చేసుకుంటూ బతకడం ఈ జబ్బు గలవారిలో ప్రధానమైన లక్షణం. దీనివల్ల వారు నమ్ముకున్న కెరీర్లో ఎదుగుదలేమీ ఉండదు. కొత్తమార్గంలో ఒరిగేదీ ఏముండదు..ఒకటి రెండు రోజులపాటు ఇలాంటి కథనాలు తప్ప. 

శ్రీనివాసమూర్తి