జనసేన పొత్తుతో ఒడ్డెక్కాలని ఓ వైపు టీడీపీ ఆరాటపడుతోంది. అయితే జనసైనికులు మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు. పొత్తు ఉన్నా లేకున్నా తమకే రాజకీయ లాభం జరగాలని వారు గట్టిగా కోరుకుంటున్నాట్లుగా కనిపిస్తోంది.
దిగువ స్థాయిలో జనసేన క్యాడర్ మా తమ్ముళ్ళూ కలసిపోయారని, పొత్తులు వారే కోరుకుంటున్నారని ఆ మధ్యన బోల్డ్ గా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటించేశారు. అయితే ఇపుడు జనసేన దూకుడు మాత్రం ఆ పార్టీనే కలవరపెడుతోంది అంటున్నారు.
విశాఖ జిల్లా నర్శీపట్నంలో జనసేన స్పీడ్ పెంచుతోంది. నియోజకవర్గంలో టీడీపీకి బలమున్న చోటనే క్యాడర్ ని తమ వైపు లాగేసుకుంటోంది. మాకవరపాలెం మండలంలో తాజాగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ తమ పార్టీలోకి వచ్చి చేరిందని జనసేన నాయకులు ప్రకటించారు.
గ్రామ గ్రామాన తమ పార్టీని అభివృద్ధి చేయమని పవన్ కళ్యాణ్ ఆదేశించారు అని వారు అంటున్నారు. రానున్న రోజుల్లో మరింతగా పార్టీని పటిష్టం చేస్తామని చెబుతున్నారు. చూడబోతే ఈ జోరుతో జనసేన ఏ మాత్రం బలపడినా సీటు కోసం బేరాలు స్టార్ట్ చేస్తుంది అన్న డౌట్ అయితే తమ్ముళ్లకు బలంగా ఉంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటే కనుక నర్శీపట్నం నుంచి కూడా సీటు కోరితే అపుడు తమ సంగతేంటని ఆ పార్టీ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా తాము సొంతంగా బలపడతామని విశాఖ జిల్లా జనసేన నాయకులు ఒక వైపు స్పష్టం చేస్తున్నారు. పవనే కాబోయే సీఎం అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రకటన చేసిన నేపధ్యం ఉంది.
తాజాగా బొలిశెట్టి సత్యనారాయణ కూడా జనసేన ఎవరినో సీఎంలను చేసేందుకు పుట్టిన పార్టీ కాదని పక్కా క్లారిటీగా చెప్పేశాక జనసైనికులు జోరు పెంచేస్తున్నారు. మరి జనసేన జోరు చూసి తమ మేలు కోసమే అనుకుంటే మాత్రం తమ్ముళ్లకు ముందున్నది ఇరకాటమే అన్న చర్చ కూడా వస్తోందిట. చూడాలి మరి పొత్తుల ఎత్తుల వ్యూహాలు ఏ విధంగా పారుతాయో.