తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ ప్రేమ మాటలు ముచ్చట కలిగిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి శ్రీదేవి ఓటు వేయడంతో టీడీపీ ఆనందానికి హద్దుల్లేవు. మరోవైపు శ్రీదేవిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో తనకు స్వేచ్ఛ లభించిందని శ్రీదేవి అంటున్నారు. అలాగే వైసీపీపై తాడికొండ ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగారు. వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఓటుకు కోట్లు తీసుకోలేదని ఆరోపణల్ని తిప్పికొట్టారు.
తన భర్తతో పాటు తాను పేరున్న వైద్యులమని, విలువైన ఆస్తులున్నాయని, రూ.10 కోట్లు, రూ.20 కోట్లకు అమ్ముడుపోయేంత నీచ స్థితిలో లేమంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షంపై సొంత పార్టీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేయడాన్ని టీడీపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంత వరకూ బాగానే వుంది.
రానున్న ఎన్నికల్లో శ్రీదేవికి తాడికొండ సీటు ఇవ్వడానికి టీడీపీ సిద్ధమా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. శ్రీదేవి ఎపిసోడ్‌తో తమ టికెట్‌కు ఎసరు వస్తుందని అప్పుడే తాడికొండ టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఆల్రెడీ బాగా డబ్బున్న ఎమ్మెల్యే కావడంతో ఆమె వైపే చంద్రబాబు మొగ్గు చూపారనే భయం తాడికొండ టీడీపీ నేతల్లో మొదలైంది. అయితే శ్రీదేవిని కరివేపాకులా వాడుకుని వదిలేయడం తప్పితే, ఆమెకు పార్టీలో పెద్దపీట వేయడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీదేవిని పావుగా వాడుకున్నారని, అంతటితో చంద్రబాబు ప్రయోజనాలు నెరవేరాయని అంటున్నారు. ఓటు వేసినందుకు తగిన ప్రతిఫలాన్ని చంద్రబాబు ఇచ్చారని, ఇకపై టీడీపీ వెంటే ఆమె నడవాలి తప్ప, తాము ఆమె కోసం ఎదురు చూడడం ఉండదని ఆ పార్టీ ముఖ్య నాయకులు స్పష్టం చేస్తున్నారు.
శ్రీదేవి అవసరం ఎమ్మెల్సీ ఎన్నికల వరకేనా? ఆ తర్వాత కూడా ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితి వుందా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా దళిత ఎమ్మెల్యే అయిన శ్రీదేవిపై టీడీపీకి ప్రేమాభిమానాలు వుంటే, ఆమెను రాజకీయంగా వాడుకోవడం కాదని, టికెట్ ఇచ్చి చిత్తశుద్ధి చాటుకోవాలని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు.