ఆస్కార్ అవార్డు కోసం యూనిట్ ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ ఆమధ్య దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ 80 కోట్లు తనకిస్తే, 10 సినిమాలు తీస్తానని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో వాడివేడి చర్చ జరిగింది.
అసలు ఆస్కార్ అవార్డ్ కోసం ఆర్ఆర్ఆర్ యూనిట్ నిజంగానే 80 కోట్లు ఖర్చు చేసింది. ఏ సినిమానైనా ఆస్కార్ వరకు తీసుకెళ్లాలంటే 80 కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనా? ఇదే ప్రశ్న ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయకు ఎదురైంది. ఆస్కార్ క్యాంపెయిన్ కోసం యూనిట్ పెట్టిన ఖర్చును ఆయన బయటపెట్టాడు.
“ఆస్కార్ కు వెళ్లాలని అనుకున్నప్పుడే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. హాలీవుడ్ సినిమాల తరహాలో మాకు స్టుడియోస్ సపోర్ట్ లేదు. మేం సొంతంగా డబ్బులు పెట్టాల్సిందే. ముందు 5 కోట్లు అనుకున్నాం. మొదటి దశలో 3 కోట్లు ఖర్చుపెట్టాం. ఆస్కార్ నామినేషన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. 5-6 కోట్ల మధ్య క్యాంపెయిన్ పూర్తి చేయాలనుకున్నాం. కానీ అంతా అయ్యేసరికి 8.50 కోట్లు ఖర్చయింది. అయితే ఈ ఖర్చు మాకు తెలిసే జరిగింది. ఎక్కడైతే వెనకబడ్డామని అనిపించిందో, అక్కడ క్యాంపెయిన్ కోసం ఎక్కువ ఖర్చు చేశాం.”
ఇలా ఆస్కార్ కోసం చేసిన ఖర్చు వివరాల్ని బయటపెట్టాడు కార్తికేయ. తమ సినిమా క్యాంపెయిన్ కోసం న్యూయార్క్ నుంచి ఒక పీఆర్ టీమ్ ను, లాస్ ఏంజెల్స్ నుంచి మరో 2 పీఆర్ టీమ్స్ ను పెట్టుకున్నామని తెలిపాడు కార్తికేయ. ఆర్ఆర్ఆర్ పై బజ్ పెరగడంతో, జులై, ఆగస్ట్ టైమ్ లో ఆర్గానిక్ గానే ప్రచారం జరిగిందని, కొన్ని విదేశీ మీడియా సంస్థలు ఎన్టీఆర్-చరణ్ తో కార్యక్రమాలు ఏర్పాటుచేశాయని, సెప్టెంబర్-అక్టోబర్ నుంచి మాత్రం పెయిడ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశామని తెలిపాడు కార్తికేయ. వీటన్నింటికీ డబ్బులు ఖర్చయ్యాయని, ఇక ఆస్కార్ వేదికపై ఒక్కో సీట్ కోసం వేల డాలర్లు ఖర్చు చేశామనే విమర్శపై కూడా ఇతడు స్పందించాడు.
“ఆస్కార్ అవార్డుల టికెట్ కు 2500 డాలర్లు చెల్లించామనడంలో నిజం లేదు. చరణ్, తారక్, రాజమౌళి, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవను అధికారికంగా అకాడమీ ఆహ్వానించింది. ఇక చంద్రబోస్, కీరవాణి నామినీస్ కాబట్టి వాళ్లు ఉన్నారు. నామినీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్లు అకాడమీకి మెయిల్ పెట్టాలి. ఎంతమందిని ఆహ్వానించాలనుకుంటున్నారో తెలపాలి. అక్కడ్నుంచి అనుమతి వచ్చిన తర్వాత, టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా వేదికకు దగ్గరగా ఉన్న కొన్ని సీట్లను సీటుకు 1500 డాలర్లు చెల్లించి కొన్నాం. మరికొన్ని టికెట్లను టాప్ లెవెల్ లో 750 డాలర్లకు ఒకటి చొప్పున కొనుగోలు చేశాం. ఇదంతా అధికారికంగా జరిగిన ప్రక్రియ. ఇందులో లాబీయింగ్ ఉండదు. ఇదంతా కామన్ గా జరిగేదే.”
ఇలా ఆస్కార్ అవార్డుల్లో టికెట్ కొనుగోళ్లపై కూడా స్పందించాడు కార్తికేయ. డబ్బులు పెట్టి ఆస్కార్ కొనుక్కున్నామంటూ వచ్చిన విమర్శల్ని పెద్ద జోక్ గా కొట్టిపడేశాడు కార్తికేయ. అలా అయితే ఈపాటికి ఇండియాకు చాలా ఆస్కార్లు వచ్చేవని, జేమ్స్ కామరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి దిగ్గజ దర్శకులు తమ సినిమాను మెచ్చుకోవడంతోనే ఆర్ఆర్ఆర్ స్థాయి అర్థం చేసుకోవచ్చని అన్నాడు. కార్తికేయ ప్రకటనతో ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చేసిన క్యాంపెయిన్ ఖర్చుపై ఓ క్లారిటీ వచ్చింది.