సౌత్ లో ఏమాత్రం క్రేజ్ వచ్చినా, వెంటనే బాలీవుడ్ తలుపు తడుతుంటారు హీరోయిన్లు. ఈ విషయంలో బాలీ మేకర్స్ కూడా ముందున్నారు. సౌత్ నుంచి కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్లను తీసుకోవడానికి వాళ్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక, సమంత, రకుల్ లాంటి ఎంతోమంది హీరోయిన్లు బాలీవుడ్ లో అడుగుపెట్టారు. కానీ కీర్తిసురేష్ మాత్రం ఇప్పటివరకు ఆ పని చేయలేదు.
నిజానికి మహానటి తర్వాత కీర్తిసురేష్ బాలీవుడ్ కు వెళ్తుందని అంతా అనుకున్నారు. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత ఆమె తన బాలీవుడ్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేస్తుందని చాలామంది భావించారు. కానీ కీర్తిసురేష్ మాత్రం సౌత్ కే ఫిక్స్ అయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు హిందీలోకి అడుగుపెట్టలేదు.
దీనిపై కీర్తిసురేష్ స్పందించింది. తనకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చిన విషయాన్ని కీర్తిసురేష్ అంగీకరించింది. దాదాపు మూడేళ్ల నుంచి తనకు హిందీ సినిమా ఆఫర్లు వస్తున్నాయని, కానీ బలమైన పాత్రలు మాత్రం దొరకడం లేదని అంటోంది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ మేకర్స్ తనను కమర్షియల్, గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే చూస్తున్నారని.. ఓ నటిగా చూసి, మంచి పాత్రలు ఆఫర్ చేస్తే తప్పకుండా హిందీలో నటిస్తానని చెబుతోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో అడుగుపెట్టకపోవడానికి ఇదే కారణమని తెలిపింది.
ఆమె నటించిన దసరా సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి, దసరా చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి తనకు బలమైన పాత్రలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది కీర్తిసురేష్. ఈ సినిమాలో పోషించిన వెన్నెల పాత్ర తన కెరీర్ బెస్ట్ అంటోంది.