పవన్ కళ్యాణ్…జ‌నసేన..కింకర్తవ్యం?

పార్టీలను కలిపి రాజ‌కీయం చేద్దాం..కులాలను కలిపి రాజ‌కీయం చేద్దాం అన్నది జ‌నసేనాధిపతి పవన్ కళ్యాణ్ దూరాలోచన. దాని వెనుక అసలు లక్ష్యం వేరు..జ‌గన్ ను గద్దె దింపాలి. చంద్రబాబును గద్దె ఎక్కించాలి.  Advertisement తను…

పార్టీలను కలిపి రాజ‌కీయం చేద్దాం..కులాలను కలిపి రాజ‌కీయం చేద్దాం అన్నది జ‌నసేనాధిపతి పవన్ కళ్యాణ్ దూరాలోచన. దాని వెనుక అసలు లక్ష్యం వేరు..జ‌గన్ ను గద్దె దింపాలి. చంద్రబాబును గద్దె ఎక్కించాలి. 

తను పనిలో పనిగా రెండో నాలుగో సీట్లు తెచ్చుకుని అధికార పార్టీకి అండగా వుండాలి. కానీ ఇక్కడ అసలు సిసలు సమస్య ఒక్కటే. ఏ కాపు సామాజిక వర్గం మద్దతుతో పవన్ ఇంత పంచవర్ష ప్రణాళిక వేసారో, ఆ వర్గాన్ని ఒప్పించడం అంత ఈజీ కాదు. అందుకే పార్టీ మీటింగ్ లో…మీరు పెద్దన్న..త్యాగాలు చేయాలి. బిసి లకు, కమ్మలకు సీట్లు ఇచ్చినా ఏమనకూడదు. ఓటు వేయాలి తప్ప అనే టైపులో బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేసారు. అదే సమయంలో మీ ఆత్మగౌరవం తాకట్టుపెట్టను అనే మాట కూడా ఇచ్చారు.

ఇదిగో…సరిగ్గా ఇదే ఇప్పుడు సమస్య కాబోతోంది. కాపుల ఆత్మ గౌరవం తాకట్టు పెట్టబడలేదు అని అనిపించుకోవాలి. అనిపించాలి. అలా జ‌రగాలి అంటే తెలుగుదేశం పార్టీతో గౌరవ ప్రదమైన ఒప్పదం కుదుర్చుకోవాలి. కానీ అదే కుదరుతుందా అన్నది అనుమానం. ఒప్పందం కుదుర్చుకునే విషయంలో పవన్ కు అనుమానాలు ఏవీ లేవు. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇంకా అనుమానాలు వున్నాయి. 

చంద్రబాబు మినహా లోకేష్ తో సహా పార్టీ మద్దతు దారులు ఎవరికీ పవన్ తో వెళ్లాలని ఇప్పుడు ఎంత మాత్రం లేదని తెలుస్తోంది. వివిధ సర్వేలు జ‌రిగాయి. జ‌రుగుతున్నాయి. ఏ సర్వేలోనూ జ‌నసేన కు అనుకూలమైన ఫలితాలు కానీ గొప్ప నెంబర్లు కానీ కనిపించడం లేదు. పైగా జ‌నసేనతో వెళ్తే బిసి లు దూరం గానే వుంటారనే భయం వెన్నాడుతోంది. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మరీ ధీమా పెరిగింది తెలుగుదేశం పార్టీకి. జ‌నసేన మద్దతు లేకుండానే గెలిచాం అనే భావన బలపడింది.

ఇక మిగిలిన ఆలోనచ ఒకటే. పొమ్మనలేక పొగ పెట్టడం. ఒక అయిదో పదో సీట్లు ఇస్తాం మద్దతు ఇవ్వండి. లేదూ అంటే లేదు అనే బేరం మొదలుపెట్టడం. ఇక్కడే సమస్య వస్తుంది. ఈ అయిదు పది సీట్లకు ఊ అని పవన్ అన్నారే అనుకోండి. అక్కడితో సరి కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవం. జ‌స్ట్ పది సీట్లకు తాకట్టు పెట్టేసినట్లు అయిపోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలుగుదేశం ఆలోచనా విధానంలో పూర్తి మార్చు వచ్చినట్లు కనిపిస్తోంది.

పరిస్థితి గమనించి జ‌నసేన మౌనంగా వుంది. ఎమ్మెల్సీ ఎన్నికల మీద నో కామెంట్ అన్నట్లు వుండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితి. ఏం ఒప్పందం కుదిరిందో ఏమో పవన్ కు, తేదేపా కే తెలియాలి. ఇన్నాళ్లూ ఖాళీగా కూర్చుని, రాజ‌కీయాలు చేయాల్సిన టైమ్ లో సినిమాలు చేసుకుంటూ కూర్చున్నారు. లోకేష్ యాత్ర చినబోకుండా వుండేందుకు వీలుగా అన్నట్లు పవన్ వారాహి వాహనాన్ని షెడ్ లో పెట్టేసారు. ఎండకాలం, వర్షాకాలం దాటిన తరువాత కానీ యాత్ర చేయరని తెలుస్తోంది. అప్పటికి లోకేష్ యాత్ర సగం వరకు పూర్తవుతుంది.

మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాదాపు కార్నర్ లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ఒంటరిగా వెళ్లలేరు. తెలుగుదేశం గట్టిగా బేరం ఆడలేరు. కింకర్తవ్యం?