ఈనాడుపై నిషేధం…ఉత్తుత్తిదే!

ఇటీవ‌ల రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఎల్లో మీడియాపై నిషేధం విధిస్తున్న‌ట్టు చెప్పిన మాట‌ల్లో నిజం లేద‌ని తేలిపోయింది. మ‌రీ ముఖ్యంగా రామోజీరావు నేతృత్వంలోని ఈనాడుపై నిషేధం ప‌చ్చి అబద్ధ‌మ‌ని ఇవాళ ఆ ప‌త్రిక‌కు…

ఇటీవ‌ల రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఎల్లో మీడియాపై నిషేధం విధిస్తున్న‌ట్టు చెప్పిన మాట‌ల్లో నిజం లేద‌ని తేలిపోయింది. మ‌రీ ముఖ్యంగా రామోజీరావు నేతృత్వంలోని ఈనాడుపై నిషేధం ప‌చ్చి అబద్ధ‌మ‌ని ఇవాళ ఆ ప‌త్రిక‌కు ఇచ్చిన ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న తేల్చి చెప్పింది. నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌పై ఈనాడు ప‌త్రిక త‌ప్పుడు క‌థ‌నం రాసిందంటూ మంత్రి కొడాలి నాని త‌న‌దైన రీతిలో రామోజీరావు, ఎల్లో మీడియాపై నోరు పారేసుకున్నారు.

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్‌, టీవీ-5తో పాటు ఈనాడు-ఈటీవీపై కూడా పార్టీ నిషేధం విధిస్తున్న‌ట్టు ఘాటు హెచ్చ‌రిక‌లు చేశారు. ఇక‌పై ఆ ప‌త్రిక‌ల‌ను, చాన‌ళ్ల‌ను మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ కార్య‌క్ర‌మాల‌కు పిల‌వ‌కూడ‌ద‌ని పార్టీ ఆదేశంగా చెప్పారు. అలాగే ఆ చాన‌ళ్ల డిబేట్ల‌కు ఏ ఒక్క వైసీపీ నాయ‌కుడు వెళ్ల‌కూడ‌ద‌ని కూడా ఆయన ఆర్డ‌ర్స్ జారీ చేశారు. దీంతో ఆయ‌న ఆదేశాలు అమ‌లు అవుతాయ‌నే అంద‌రూ భావించారు.

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్‌, టీవీ-5 మీడియా సంస్థ‌ల‌కు ఏ విధంగానైతే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌రో, నాని హెచ్చ‌రిక‌ల త‌ర్వాత ఈనాడు-ఈటీవీకి కూడా అదే సూత్రం అమ‌లవుతుంద‌ని అనుకున్నారు. కొడాలి నాని నిషేధం విధించిన రెండు మూడు రోజుల‌కే ఇవాళ ఈనాడు ఫ‌స్ట్ పేజీలో వైద్యారోగ్య‌శాఖ‌కు సంబంధించిన యాడ్ అర‌పేజీ చొప్పున క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. 

కోవిడ్ ధ‌ర్డ్ వేవ్ మొదలైన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా మ‌హ‌మ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో అత్యాధునిక ఆక్సిజ‌న్ సౌక‌ర్యాల‌ను క‌ల్పించే కార్య‌క్ర‌మానికి సోమ‌వారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. దీనికి సంబంధించి సాక్షితో పాటు ఈనాడు ప‌త్రిక‌కు కూడా అంతేస్థాయిలో వాణిజ్య ప్ర‌క‌ట‌న ఇచ్చారు. త‌ద్వారా ఈనాడును నిషేధించార‌నే మాట ఉత్తుత్తిదే అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మాత్రం దానికి ఈనాడుపై నోరు పారేసుకోవ‌డం దేనిక‌నే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.  

ఈనాడుపై నిషేధానికి సంబంధించి పార్టీ ప‌రంగానా, లేక ప్ర‌భుత్వ ప‌రంగా ప్ర‌క‌టించారా అనే విష‌య‌మై ఇప్ప‌టికైనా మంత్రి కొడాలి నాని వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంది.