కరోనా ఫస్ట్ వేవ్‌తో పీడ విరగడ అవుతుందనుకుంటే సెకెండ్ వేవ్ కూడా వచ్చి విధ్వంసం సృష్టించింది. ఎంతో మంది ప్రాణాలను డెల్టా వేరియంట్ బలి తీసుకుంది. ఇప్పుడు ఒమిక్రాన్ వంతు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పుడు మన దేశంలో కూడా నెమ్మదిగా జోరు పెంచుతోంది. కరోనా సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ దొరక్క కళ్లెదుటే ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.
పేద, ధనిక తేడా లేకుండా కరోనా సెకెండ్ వేవ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఏడాది క్రితం ఆక్సిజన్ దొరకని దుర్భర పరిస్థితులను తలచుకుంటేనే భయం వేస్తోంది. కనీసం ఆక్సిజన్ దొరకలేదని పీడకల కనడానికి కూడా జనం సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని జగన్ ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం.
ప్రభుత్వ ఆస్పత్రులంటే సాధారణంగా పేదలు వెళుతుంటారు. అలాంటి చోట 144 ఆక్సిజన్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సోమవారం క్రితం ప్రారంభించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.426 కోట్ల వ్యయంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో మాటలకు పరిమితం కాకుండా చేతలకు పని చెప్పడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇలాంటి అత్యవసర సర్వీసులను మరింతగా వృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
ఎందకంటే విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడం అంటే అది ముమ్మాటికీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అని చెప్పక తప్పదు. కష్ట సమయంలో తమను ఆదుకున్న వాళ్లను కాపాడుకునేందుకు ప్రజలు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు.