ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ అమల్లో …సచివాలయ ఉద్యోగులను మినహాయించడంతో వాళ్ల వైపు నుంచి తిరుగుబాటు ఎదురైంది. ఈ పరిణామాల్ని జగన్ సర్కార్ అసలు ఊహించలేదు. అందులోనూ మానస పుత్రికగా చెప్పుకునే సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు తన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన బాట పడుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలలో కూడా ఊహించి వుండరు.
ఇదంతా సీఎం జగన్ స్వయంకృతాపరాధమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా 1.14 లక్షల మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకున్నారు. ఈ సందర్భంగా రెండేళ్లకు రెగ్యులరైజ్ చేస్తానని, జీతం రెండింతలు చేస్తానని అధికారం చేపట్టిన ఉత్సాహంలో వరాల జల్లు కురిపించారు.
పాలన సగం కాలం పూర్తయ్యే సరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాళ్లకు బంధాలు వేస్తూ వస్తోంది. పైగా కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మినహాయింపేమి కాలేదు. అయినప్పటికీ జగన్ తానిచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను ఎక్కడా నిలుపుదల చేయడానికి కొనసాగించారు. దీంతో కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి జీవులకు కొండంత ఉపశమనం కలిగించినట్టైంది.
కరోనా విపత్కర పరిస్థితుల్లో సచివాలయ వ్యవస్థ అందించిన సేవలకు వెల కట్టలేదు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు విపత్కర పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించారు. మహమ్మారిని సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో ధైర్యంగా నిలబడగలిగారు. అయితే ఫలాల విషయానికి వచ్చే సరికి తమను దూరం పెట్టడంపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తానిచ్చిన మాట ప్రకారం రెండేళ్లకు ప్రొబేషన్‌ను రెగ్యులర్ చేయకుండా కాలయాపనకు తెరలేపారు. నూతన పీఆర్సీని మరో ఆరు నెలల తర్వాత అమలు చేస్తామనడంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. అసలే అంతంత మాత్రం జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించాలని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం రూ.15 వేల వేతనం ఇస్తూ తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధిత యూనియన్ నాయకులతో ఇవాళ ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చించనున్నారు. లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చి కూడా…చిన్న తప్పిదం వల్ల వాళ్ల వ్యతిరేకతను సంపాదించకోవడం జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం. కావున ఇప్పటికైనా వాళ్ల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా వైసీపీకి మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.