కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడంలో నిర్లక్ష్యం చూపడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మూడో వేవ్ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. దేశంలో కరోనా మూడో వేవ్ లో పంజా విసురుతున్న నేపథ్యంలో.. ఎక్కువగా బాధితులు అవుతున్నది ఎవరు? అంటే.. వ్యాక్సిన్ ను వేయించుకోని వారేనని వైద్యులు చెబుతూ ఉన్నారు. మచ్చుకు ముంబైలో జరిగిన ఒక పరిశీలనను గమనించవచ్చు.
ముంబైలో ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్ మీద చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో తొంభై ఆరు శాతం మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోని వారేనట! కరోనాను ఎదుర్కొనడానికి ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తున్నా.. దాన్ని తీసుకోవడానికి కొందరు వెనుకాడారు. కొందరు కాదు, కోట్ల మంది వ్యాక్సిన్ ను వేయించుకోలేదు. కొందరు ఒక డోసు తీసుకుని.. రెండో డోసు విషయంలో యథారీతిన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాంటి వారందరికీ ఇది చేదు వార్తే.
కరోనా కారణంగా అనారోగ్యానికి గురై ఆక్సిజన్ సపోర్ట్ వరకూ వెళ్లిన వారిలో 96 శాతం మంది వ్యాక్సిన్ ను వేయించుకోని వారే అంటే… పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
అలాగని వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కరోనా సోకదని ఎవ్వరూ చెప్పడం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ ను పొందిన వారు, తాము ఇప్పుడు కరోనా బారిన పడినట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే హాస్పిటలైజ్ అవుతున్న వారిలో మాత్రం అన్ వ్యాక్సినేటెడ్ వాళ్లే ఎక్కువని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్ పొందిన వారు కొందరు తమకు కరోనా ఇప్పుడు సోకిందని చెబుతున్నారు. అయితే వెరీ మైల్డ్ సింప్టమ్స్ అని వారే చెబుతున్నారు.
రెండు డోసుల వ్యాక్సిన్ పొంది, వీటి మధ్యలోనే ఒకసారి కరోనా కు గురై, తేలికగానే కోలుకున్న వారు ఇప్పుడు ధీమాగా ఉండవచ్చని పరిస్థితిని బట్టి స్పష్టం అవుతోంది. అలాగని మాస్కులూ గట్రా వదిలేయమని కాదు.