బంగారం కరిగించి.. ముద్దగా చేసి.. పొట్టలో దాచి..!

బంగారం స్మగ్లింగ్ లో కనిపించినంత క్రియేటివిటీ బహుశా మరే స్మగ్లింగ్ లో కనిపించదేమో. ఎప్పటికప్పుడు కస్టమ్స్ అధికారులకు బంగారం అక్రమ రవాణాకు సంబంధించి కొత్త కొత్త ఎత్తులు కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్లను విస్తుపోయేలా చేస్తూనే…

బంగారం స్మగ్లింగ్ లో కనిపించినంత క్రియేటివిటీ బహుశా మరే స్మగ్లింగ్ లో కనిపించదేమో. ఎప్పటికప్పుడు కస్టమ్స్ అధికారులకు బంగారం అక్రమ రవాణాకు సంబంధించి కొత్త కొత్త ఎత్తులు కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్లను విస్తుపోయేలా చేస్తూనే ఉన్నాయి. తాజాగా శంషాబాద్ లో ఇలానే కొంత బంగారాన్ని సీజ్ చేశారు. సదరు వ్యక్తి ఈ బంగారాన్ని దాచిన విధానం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ వ్యక్తి 960 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయాలని నిర్ణయించుకున్నాడు. కస్టమ్స్ అధికారులకు దొరక్కుండా ఉండేందుకు ఓ కొత్త ఉపాయం ఆలోచించాడు. మొత్తం బంగారాన్ని కరిగించాడు. దాన్ని పేస్టుగా మార్చాడు. ఆ తర్వాత అమాంతం మింగేశాడు. అలా దాదాపు కిలో బంగారాన్ని పొట్టలో దాచేశాడు.

పొట్టలో ఉన్న బంగారాన్ని ఎవ్వరూ కనిబెట్టలేరని భావించాడు ఆ ప్రయాణికుడు. కానీ కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో, అతడి పొట్టలో ఏదో గట్టి ముద్ద ఉందని గమనించారు. వెంటనే అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నిస్తే.. బంగారాన్ని దాచిన విషయాన్ని అంగీకరించాడు.

నిందితుడ్ని మహ్మద్ అర్షద్ గా గుర్తించారు పోలీసులు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని హాస్పిటల్ కు తరలించారు. ఆపరేషన్ చేసి పొట్టలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.