ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలి, జీతాలు పెంచాలి. ఇవన్నీ న్యాయమైన డిమాండ్లే. కానీ కరోనా కష్టకాలంలో కొన్ని నెలలు ప్రొబేషన్ వాయిదా వేస్తే తప్పేంటి. అంత మాత్రానికే వారు రోడ్డెక్కాలా, వాట్సప్ గ్రూప్ ల నుండి లెఫ్ట్ అవ్వాలా, ప్రభుత్వంతో కయ్యానికి దిగాలా..? నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలియజేయాలా..? విధులకు హాజరు కాబోమంటూ నోటీసులివ్వాలా..?
సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ ఉద్యోగులంతా ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. జగన్ సీఎం కావడం వల్లే వీళ్లందరికీ ఒకేసారి ఉద్యోగాలొచ్చాయి, నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన వీరంతా కేవలం జగన్ తీసుకొచ్చిన సచివాలయాలు అనే కాన్సెప్ట్ వల్లే ఉద్యోగాలు పొందారు. కానీ కష్టకాలంలో మాత్రం ప్రభుత్వానికి కాస్త మద్దతు తెలిపేందుకు కూడా ముందుకు రాకపోవడం దురదృష్టకరం.
వాస్తవానికి సచివాల ఉద్యోగులు ఎంతపని చేస్తున్నారో.. దాదాపుగా వాలంటీర్లు కూడా ఆ స్థాయిలోనే పనిచేస్తున్నారు. వీరు ఆఫీసుల్లో ఉంటే వారు గ్రౌండ్ లెవల్లో డేటా సేకరిస్తూ, ఇంటింటికీ తిరిగి పింఛన్లు ఇస్తూ క్షేత్ర స్థాయిలో విధులు సమర్థంగా నిర్వహిస్తున్నారు. 5వేల రూపాయల పారితోషికానికే వారు సంబరపడుతున్నారు. గతంలో జీతాలు పెంచాలనే డిమాండ్ వినపడినా.. జగన్ మాట విని సైలెంట్ అయ్యారు. తమది సేవేనని సరిపెట్టుకున్నారు.
వాలంటీర్లతో పోల్చి చూస్తే సచివాలయ ఉద్యోగులు కొంతకాలం వేచి చూడలేరా..? ఉద్యోగాల కోసం విసిగి వేసారిపోయిన రోజుల్ని మరిచిపోయారా? జగన్ మాట తప్పలేదు.. జస్ట్ వాయిదా వేశారంతే.. ఈమాత్రం దానికే ఎందుకింత హంగామా. కొన్ని రోజులు వెయిట్ చేయలేరా? పీఆర్సీ కోసం, డీఏల కోసం ఉద్యోగులు వెయిట్ చేయలేదా?
పరిస్థితి అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు అని ఈపాటికే జనంలో ఓ అభిప్రాయం వచ్చింది. కేవలం జీతం కోసమే కాదు, జనం జీవితం కోసం కూడా అనే భావన సచివాలయ ఉద్యోగుల్లో వచ్చినప్పుడు మాత్రమే జగన్ చేపట్టిన భారీ ఉద్యోగ నియామక ప్రక్రియకు సత్ఫలితం దక్కినట్టు.