భలే పంచ్ వేసేసారు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. కుప్పంలో చంద్రబాబు వన్ సైడ్ లవ్ మీద గురి చూసి మరీ సునిశితమైన విమర్శలతో బాణం వదిలారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ని కూడా ఈ లవ్ ట్రాక్ లోకి లాక్కొచ్చారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల మధ్య లవ్ ట్రాక్ వాళ్ల ఇష్టమట. అయితే ఈ లవ్ ట్రాక్ ఎపుడు మొదలవుతుందో పెళ్ళి ఎపుడు చేసుకుంటారో, మళ్లీ ఎపుడు విడాకులు తీసుకుంటారో ఎవరికి ఎరుక అంటూ పంచులు పేల్చారు.
ఈ ఇద్దరి లవ్ ట్రాక్ గురించి తమకేమి తెలుసంటూ మీడియా ముందే సెటైర్లు వేశారు. చంద్రబాబుది ఏపీ రాజకీయాల్లో చెదిరిన చరిత్ర అని రానున్న కాలంలో ఆయన పేరు కూడా ఎక్కడా చెప్పుకోవడానికి ఉండదని బొత్స హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు తాజా కుప్పం పర్యటనలో ఆవేదన వెళ్లగక్కుతున్నారని, దాన్ని చూస్తే తమ లాంటి వారికి జాలి కలుగుతోందని బొత్స అనడం విశేషం. నిజానికి కుప్పంలో ఎందుకు ఓడామని ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన బాబు అది కాస్తా పక్కన పెట్టి జగన్ మీద, తమ పార్టీ మీదా అదే పనిగా విమర్శలు చేయడమే విడ్డూరమని బొత్స అన్నారు.
ఇక పేదల ఇళ్ళకు రిజిష్ట్రేషన్ చేసి యాజమాన్య హక్కులు కల్పించడం సర్కార్ చేస్తున్న మంచి పని అన్నారు. దీనికి టీడీపీ కూడా తప్పనిసరిగా మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని బొత్స పేర్కొన్నారు. మొత్తాని కి పెళ్ళిళ్ళూ విడాకులు అంటూ బొత్స పేల్చిన పంచులు బాగానే పేల్తున్నాయి.