బస్సెక్కుతున్నారా.. రూ.50 ఎక్స్ ట్రా పెట్టుకోండి

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం.. సురక్షితం, సౌకర్యవంతం.. ఆడవారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం, టిక్కెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.. అంటూ రాసిన స్లోగన్లు గతంలో బస్సులలో కనిపించేవి.. అయితే కరోనా…

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం.. సురక్షితం, సౌకర్యవంతం.. ఆడవారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం, టిక్కెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.. అంటూ రాసిన స్లోగన్లు గతంలో బస్సులలో కనిపించేవి.. అయితే కరోనా పుణ్యమా అని ఇప్పుడు ట్రెండ్ మారింది.. మాస్క్ లేని ప్రయాణం ప్రమాదకరం అంటూ సూచనలు కనిపిస్తున్నాయి. సూచనలు మాత్రమే కాదండోయ్.. అతిక్రమిస్తే జరిమానాలు కూడా విధిస్తున్నారు.

ఏపీలోని ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలంటే కచ్చితంగా మాస్క్ పెట్టాల్సిందే.. ఒకవేళ ఎవరైనా పొరపాటు వల్లనో.. నిర్లక్ష్యంతోనో మాస్క్ ధరించకపోతే వారికి జరిమానాలు కూడా విధించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అంతే కాదు, దాన్ని తక్షణం అమలులో పెట్టారు కూడా.

ముందుగా బస్ స్టాండుల్లో..

బస్ స్టాండుల్లో మాస్క్ లేకుండా ఎవరైనా కనపడితే, వెంటనే వారి దగ్గరకు వెళ్లి టికెట్ మిషన్ నుంచి ఓ టికెట్ ప్రింట్ తీసి చేతిలో పెడతారు సిబ్బంది. జస్ట్ 50 రూపాయల ఫైన్ అంతే. కట్టలేదా మీ పని అంతే. నాలుగైదు రోజులుగా ఇది ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు బస్సుల్లో కూడా అమలులోకి తెచ్చారు. బస్ స్టాండుల్లో ఆర్టీసీ సిబ్బంది చేతికి టిమ్ మిషన్లు ఇచ్చి ఇలా ఫైన్లు వసూలు చేయిస్తున్న అధికారులు, బస్సుల్లో కండక్టర్ వద్ద ఉన్న టిమ్ మిషన్లలో జరిమానా టికెట్ కూడా పెట్టారు. అవును, ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో పొరపాటున మాస్క్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా 50 రూపాయలు చెల్లించాల్సిందే.

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మాస్క్ లేకపోతే ప్రమాదం ఎక్కువ అని చెప్పడంతో పాటు, దాన్ని జీవన విధానంగా చేసేందుకే ఈ ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రయాణ సమయంలో మాస్క్ లేకపోతే కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ప్రయాణ సమయంలో ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే నేరుగా బస్సులోని కండక్టర్ కు ఫిర్యాదు చేయాలని కూడా ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టేశారు. ఇందుకు అనుగుణంగానే మాస్క్ లేకపోతే స్పాట్ లో ఫైన్ విధించే విధానాన్ని తీసుకొచ్చారు.

మొత్తానికి రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ఇప్పటికే అధికారులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆంక్షలు కూడా మొదలయ్యాయి. త్వరలోనే రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.. పెళ్లిళ్లు, థియేటర్లలో ఆక్యుపెన్సీ వంటి వాటిపై కూడా నేడో రేపో ప్రకటన విడుదల అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

సో.. మాస్క్ లేకుండా ప్రయాణాలు చేయవద్దు.. ఒక వేళ చేయాలనుకుంటే ఓ యాభై ఎక్స్ ట్రా జేబులో పెట్టుకోవడం మర్చిపోవద్దు..