చంద్రబాబుకు ఏమయింది?

నలభై ఏళ్ల రాజ‌కీయ అనుభవం. సైబరాబాద్, అమరావతి నగరాల భవిష్యత్ దర్శనం. ఇలాంటి నేత చంద్రబాబుకు ఏమయింది. ఎందుకు రాజ‌కీయ ప్రకటనల్లో తడబడుతున్నారు. అధికారం చేజారిన నేపథ్యంలో, ఎలాగైనా అధికారం అందుకుని పార్టీని, తనయుడిని…

నలభై ఏళ్ల రాజ‌కీయ అనుభవం. సైబరాబాద్, అమరావతి నగరాల భవిష్యత్ దర్శనం. ఇలాంటి నేత చంద్రబాబుకు ఏమయింది. ఎందుకు రాజ‌కీయ ప్రకటనల్లో తడబడుతున్నారు. అధికారం చేజారిన నేపథ్యంలో, ఎలాగైనా అధికారం అందుకుని పార్టీని, తనయుడిని నిలబెట్టాలన్న తపనలో తనకు తోచింది మాట్లాడేస్తున్నారా?

గతంలో ఓసారి తాము వేసిన రోడ్ల మీద నడుస్తూ, తాము కట్టిన ఇళ్లలో వుంటూ, తమ పథకాలు తీసుకుంటూ, తమకు ఎందుకు ఓట్లు వేయరు అంటూ జ‌నాన్ని నిలదీసారు.

ఆ తరువాత ఎప్పుడో పల్నాడు పౌరుషం ఏమైంది..గుంటూరు మిర్చి ఘాటు ఏమైందీ అనేట్లుగా ఓ పబ్లిక్ మీటింగ్ లో మాటలు విసిరారు.

సరే అదంతా అయిపోయింది.

మొన్నటికి మొన్న జ‌నసేన మీద తన వన్ సైడ్ లవ్ ను ఓపెన్ గా వ్యక్తపరిచారు. దశాబ్దాల చరిత్ర వున్న పార్టీ, రాష్ట్రం మొత్తం మీద బలమైన క్యాడర్ వున్న పార్టీ కి నేత ఇలా మాట్లాడ వచ్చా? ఒక్క స్థానంలో గెలిచిన పార్టీ, పార్టీ నేత రెండు చోట్లా ఓడిపోయిన వైనం. పోనీ ఇప్పుడేమయినా బలపడి వుందేమో అనుకుందాం. అయినా ఇంతలా వన్ సైడ్ కు దిగజారిపోవాలా?

ఇలాంటి బేలతనం పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తుంది? జ‌నసేన పొత్తులేకనే 2019 ఎన్నికల్లో ఓడిపోయామనే భావన ఇప్పటికే పార్టీ జ‌నాల్లో వుంది. ఇప్పుడు ఆ పార్టీ తో పొత్తు కుదరకపోతే ఇక అంతే సంగతులు అనే భావన బలపడదా? 2024 వేళకు పొత్తు కుదరితే సరే, లేకపోతే పార్టీ బలగం మానసికంగా బలహీనం కాదా?

అదే సమయంలో జ‌నసేన పార్టీ నేతలు ఏవిధంగా ఫీల్ అవుతారు? తమ పొత్తు కోసం తెలుగుదేశం ఎంతలా తహతహలాడుతోందో అర్థం కాదా? దాంతో వాళ్ల బలాన్ని వాళ్లు మరింతగా అంచనాలు పెంచుకుని, గొంతెమ్మ కోరికలు కోరితే తీర్చగలరా?

సరే ఇదిలా వుంచితే..కుప్పంలో ఏమన్నారు. సీనియర్లు జూనియర్రను తొకేస్తున్నారు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అసలు బాబుగారి చేతికి తెలుగుదేశం పగ్గాలు వచ్చిన తరువాత ఆయన కొత్త రక్తాన్ని ప్రోత్సహించింది ఎప్పుడు? ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పాత మొహాలే కదా. లేదూ అంటే వైకాపా నుంచి వలస వచ్చిన వారు. మరి రెండో జ‌నరేషన్ పార్టీలో ఎందుకు, ఏ ఆశతో వుంటుంది? అది ఇప్పుడు తెలిసివచ్చింది అనుకోవాలా?

పనిలో పనిగా బాబుగారు ఇంకో మాట కూడా అన్నారు. ఎవ్వరూ క్షేత్ర స్థాయిలో వుండడం లేదు అని. ఆ మాట ముందుగా ఆయనకు ఆయనే సంధించాలి. ఎందుకంటే ఆయనే ఈ రాష్ట్రంలోనే వుండకుండా తెలంగాణలో వుంటున్నారు. ఇలా వస్తున్నారు. అలా వెళ్తున్నారు. మరి ఆయనే గెస్ట్ ఆర్టిస్ట్ అయితే కింది స్థాయి నాయకులు మాత్రం ఎందుకు వుంటారు?

లేటెస్ట్ గా మరో ముచ్చట.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు సమాంతరంగా ఓ పార్టీ వ్యవస్థను తీసుకువస్తాం. అధికారంలోకి వచ్చాక వారినే వాలంటీర్లుగా మారుస్తాం అని కదా అన్నది.

ఇక్కడ రెండు పాయింట్లు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తప్పు పడుతూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ వ్యవస్థనో, అలాంటి దాన్నో కొనసాగిస్తామని చెప్పడం అంటే అది సరైనదే అని ఒప్పుకున్నట్లే కదా? సరే ఆ ముచ్చట అలా వుంచితే ఇప్పటికి గ్రామ వాలంటీర్లుగా లక్షల మంది పని చేస్తున్నారు. 

ఇప్పుడు అధికారంలోకి వస్తే వారిని తొలగించి తమ పార్టీ వారికి అవకాశం ఇస్తాం అని చెప్పడం అంటే, కొత్త ఓట్లు రాబట్టడం కాదు, ముందు ఆ వాలంటీర్ల ఓట్లు అన్నీ కచ్చితంగా పోగొట్టుకోవడం. ఎందుకంటే బాబుగారు వస్తే తమ ఉద్యోగం ఊడుతుంది అంటే ఎవరు మాత్రం ఆయనకు అనుకూలంగా ఓట్లు వేస్తారు?

ఇలా బాబుగారు మాట్లాడుతున్న మాటలు..ఏమిటో మరి..ఆయన అనుభవం పండిపోయి..అయోమయంగా మారుతోందేమో?