బంగార్రాజు సినిమా ఇలా మొదలైందో లేదో అలా అందులో అఖిల్ ఉన్నాడంటూ పుకార్లు చెలరేగాయి. మనం సినిమా టైపులో అఖిల్ ఇలా వచ్చి అలా మెరుస్తాడంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు నాగ్. బంగార్రాజు రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా మాట్లాడిన నాగ్.. ఈ సినిమాలో అఖిల్ లేడని స్పష్టం చేశాడు.
అయితే నాగార్జున ఇలా క్లారిటీ ఇవ్వగానే, అలా మరో పుకారు ఊపందుకుంది. త్వరలోనే బంగార్రాజు సినిమాకు కూడా సీక్వెల్ వస్తుందని, అందులో అఖిల్ హీరోగా కనిపిస్తాడంటూ రూమర్స్ మొదలయ్యాయి. వీటిపై దర్శకుడు కల్యాణ్ కృష్ణ స్పందించాడు.
“అఖిల్‌తో బంగార్రాజుకు సీక్వెల్ అంటే కష్టం. ముందు కథ రాసిన తర్వాత నేను సంతృప్తి చెందాలి. ఆ తరువాత వారిని మెప్పించాలి. ఎగ్జైట్ చేసే పాయింట్ దొరికితే అఖిల్ తో బంగార్రాజు సీక్వెల్ ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి ఆలోచన అయితే లేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం బంగార్రాజు రిలీజ్ పైనే ఉంది.”
ఇలా బంగార్రాజు సీక్వెల్ పై స్పందించాడు కల్యాణ్ కృష్ణ. నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా సినిమా చేశాడు కల్యాణ్ కృష్ణ. ఆ తర్వాత నాగచైతన్యతో రారండోయ్ వేడుకచూద్దాం సినిమా చేశాడు. ఇప్పుడు వీళ్లిద్దర్నీ పెట్టి బంగార్రాజు కూడా తీశాడు. ఇప్పుడు ఇదే ఊపులో అఖిల్ తో కూడా సినిమా తీస్తే, అక్కినేని హీరోలు ముగ్గుర్ని కవర్ చేసిన దర్శకుడు అవుతాడు కల్యాణ్ కృష్ణ.