మహేష్ బాబు జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటనల్లో ఇదొకటి. అన్నయ్యను చివరి చూపు చూసుకోలేకపోయాడు మహేష్ బాబు. అవును.. అన్నయ్య రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ హాజరవ్వలేకపోయాడు. దీనికి కారణం ఆయన హోం ఐసొలేషన్ లో ఉండడమే.
ఈమధ్య కరోనా బారిన పడ్డాడు మహేష్. ఆ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించాడు. ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసొలేషన్ లో ఉన్నాడు. సరిగ్గా ఇదే టైమ్ లో మహేష్ అన్నయ్య రమేష్ బాబు హఠాన్మరణం చెందారు. దీంతో కరోనా సోకిన మహేష్, అన్నయ్యను కడసారి చూసుకోలేకపోయాడు.
కొద్దిసేపటి కిందట రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇటు అంత్యక్రియలు జరుగుతుంటే, అటు తన గదిలో ఓదార్చే వాళ్లు లేక, ఒంటరిగా, మౌనంగా ఉండిపోయాడు మహేష్. అన్నయ్యను చివరిసారి మహేష్ చూసుకోలేకపోయాడు, అదే టైమ్ లో తండ్రి కృష్ణ పక్కన, ఆయనకు ధైర్యం చెబుతూ నిలబడలేకపోయాడు. నిజంగా ఈ బాధ వర్ణనాతీతం. జీవితాంతం వెంటాడే పెయిన్ ఇది. మహేష్ దీన్ని మోయక తప్పదు.
మహేష్-రమేష్ మధ్య మంచి అనుబంధం ఉంది. తనకంటే చాలా చిన్నవాడైన మహేష్ అంటే రమేష్ బాబుకు ఎంతో ప్రేమ. అటు మహేష్ కూడా రమేష్ తోనే అన్నీ పంచుకునేవారు. అలాంటి అన్నయ్య దూరమవ్వడం మహేష్ జీవితంలో పూడ్చలేని వెలితి.
తన అన్నను కోల్పోయిన బాధకు అక్షరరూపం ఇచ్చాడు మహేష్. ట్విట్టర్ లో తన బాధను, అన్నయ్యపై ప్రేమను వ్యక్తపరిచాడు. అన్నయ్యే తనకు స్ఫూర్తి, బలం, ధైర్యం అని చెప్పిన మహేష్.. అన్నయ్య లేకపోతే తనలో సగం లేనట్టేనని చెప్పుకొచ్చాడు.