మన పొరుగు రాష్ట్రంలో కోవిడ్ ఉగ్రరూపం దాల్చింది. మరోసారి కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లను మరిపించేలా థర్డ్ వేవ్ ముంచు కొస్తోంది. మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసులు 40 వేలకు చేరుకున్నాయి. దేశంలోనే అత్యధికంగా నమోదవుతున్న ఈ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. రానున్న ప్రమాదాన్ని మహారాష్ట్ర కేసులు ఒక హెచ్చరిక చేస్తున్నాయి.
దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రాత్రి 11 నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఎంతో ముఖ్యమైన, అత్యవసర పనులకు మినహా ఇతరత్రా వాటి కోసం ప్రజల్ని రోడ్డు మీదకు అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు.
అలాగే పగటి పూట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటాన్ని మహారాష్ట్రలో నిషేధించారు. అలాగే ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ, మహమ్మారిని అదుపు చేస్తామే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ విధించేది లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు.
కావున అందరూ కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తూ మహమ్మారికి దూరంగా ఉండాలని ఆయన ప్రజానీకాన్ని కోరారు. మహారాష్ట్రలో నమోదవుతున్న భారీ కేసులను దృష్టిలో పెట్టుకుని తెలుగు సమాజం అప్రమత్తమవుతోంది. ఎందుకంటే మహారాష్ట్రతో నిత్యం మన రాకపోకలు సాగిస్తూ వుంటారు. మన వరకూ రాదనుకుంటే మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే!