ఇండియన్ కరెన్సీ మీద లక్ష్మీదేవి బొమ్మలు ముద్రించాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. గొప్ప ఆర్థిక వేత్తగా పేరుండేది ఈ స్వామికి! ఈ డిమాండ్ తో ఆయన ఇమేజ్ ఎటుకేసి వెళ్తుందో మరి. బీజేపీ వాళ్ల జాతీయ వాదం ఆఖరికి ఈ దిశగా సాగుతూ ఉంది.
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడింది. ఇలాంటి సమయంలో అధికారాన్ని కలిగి ఉండి, రక్షించాల్సిన మేధావులు ఇలా కరెన్సీ నోట్ల మీద లక్ష్మిదేవి బొమ్మ లేకపోవడమే ఇన్ని కష్టాలకూ కారణం అని అంటున్నారు. అదేమంటే ఇండోనేసియా కరెన్సీ మీద వినాయకుడి బొమ్మ రెఫరెన్స్ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ పతనం అవుతూనే ఉంది.
మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఇండియా కన్నా మంచి స్థాయిలో పురోగమిస్తూ ఉందని అంతర్జాతీయ నివేదికలు చెబుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం మాత్రం.. ఎన్ఆర్సీ, సీఏఏ అంటూ ఉంది. ధరల పెరుగుదల గురించి మాట్లాడితే.. మా ఇంట్లో ఉల్లిపాయలు తినం అనే ఆర్థిక మంత్రి, రూపాయి మారకం విలువ గురించి మాట్లాడితే.. కరెన్సీ మీద లచ్చిందేవి బొమ్మ లేకపోవడం వల్లనే ఇలా అనే ఆర్థిక మేధావి! భలే సరిపోయారు లే.
మొత్తానికి సుబ్రమణ్యస్వామి మరో విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదేమిటంటే భారత ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలి తప్ప.. తమ ప్రభుత్వానికి అలాంటి శక్తి లేదని చెప్పకనే చెప్పారు. అసలే సుబ్రమణ్యస్వామి గొప్ప జాతీయ వాది! భక్తుల దృష్టిలో ఇంతకు మించిన ఆర్థిక మేధావి లేరు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా రాత్రికి రాత్రి మారకంలోని నోట్లను రద్దు చేసి, లచ్చిందేవి బొమ్మలతో కొత్త కరెన్సీని ముద్రించి జనాలకు ఇస్తే పోదా! మోడీజీ అనుకుంటే అదేమైనా పెద్ద పనా?