జనసేన: సైనికులు అటు.. సేనాని ఇటు

జనసేన పార్టీలో కార్యకర్తలకు, పవన్ కల్యాణ్ కు మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యం. గత ఎన్నికల టైమ్ లోనే జనసేనానికి, జనసైనికులకు మధ్య ఉన్న ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కొట్టొచ్చినట్టు కనిపించింది.…

జనసేన పార్టీలో కార్యకర్తలకు, పవన్ కల్యాణ్ కు మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యం. గత ఎన్నికల టైమ్ లోనే జనసేనానికి, జనసైనికులకు మధ్య ఉన్న ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే అదిప్పుడు బహిరంగం అయింది. క్యాడర్ అంతా ఒకవైపు మొగ్గుచూపుతుంటే, పవన్ కల్యాణ్ ఒక్కరు మరోవైపు అర్రులు చాస్తున్నారు. పవన్ ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత ఈ చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

తెలిసో తెలియకో గతంలో టీడీపీకి మద్దతిచ్చారు పవన్ కల్యాణ్. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు అతడిపై ఈగ వాలనివ్వలేదు. కేవలం ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే బాబుతో విభేదించి సొంతంగా ఎన్నికలకు వెళ్లారు. అయితే చంద్రబాబుతో చేసిన సహచర్యం కారణంగా పవన్ ఈజీగానే యూ-టర్న్ తీసుకోగలిగారు కానీ జనసైనికులు మాత్రం అంత త్వరగా టర్న్ తీసుకోలేకపోయారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన ఒకటే. ఇలాంటి టైమ్ లో బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తున్నారు పవన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

సరిగ్గా ఇక్కడే జనసైనికులకు, పవన్ కల్యాణ్ కు మధ్య గ్యాప్ కనిపిస్తోంది. టీడీపీని కాదని క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్లలేమంటున్నారు జనసైనికులు. మొన్నటివరకు ఆర్థిక సహకారంతో పాటు లాజిస్టిక్ సపోర్ట్ కూడా టీడీపీనే ఇచ్చిందని, ఇప్పుడు వాళ్లను కాదని ఊళ్లలో తిరగలేమంటున్నారు. పైగా గ్రామస్థాయిలో బీజేపీ జీరో కాబట్టి, అస్సలు క్యాడర్ లేని అలాంటి పార్టీని మోయడం శుద్ధ దండగ అంటున్నారు.

పవన్ మాత్రం మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. ఎప్పట్లానే జనసైనికుల మాటల్ని ఆయన పెడచెవిన పెడుతున్నారు. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. గతంలో టీడీపీ ఆర్థిక సాయం అందించినట్టు, ఈసారి బీజేపీ పవన్ కు ఆర్థిక సాయం అందిస్తుందన్నమాట. కానీ అన్నీ డబ్బుతో అవ్వవు, క్షేత్రస్థాయిలో జనం కావాలి. అది బీజేపీ వల్ల కాదు. జనసైనికుల బాధ ఇదే. దీన్ని పవన్ అర్థం చేసుకోవడం లేదు.

సార్వత్రిక ఎన్నికల్లో చేసిన తప్పునే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పవన్ రిపీట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు జనసైనికులు. మొన్నటివరకు నాయకులు మాత్రమే పార్టీని వీడారు. ఈసారి పవన్ తీసుకున్న నిర్ణయంతో జనసైనికులు కూడా పార్టీని వీడి పోయే పరిస్థితి తలెత్తింది