తెలుగు సినిమా అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ రాయలసీమ వైపు వచ్చింది. రాయలసీమ దాటి తెలుగు సినిమా ఒక్క ఏడాది కూడా వేరే సినిమాలను తీయలేకపోతోంది. హీరోకో, విలన్ కో రాయలసీమ నేపథ్యం తప్పనిసరి. ఎక్కడో కశ్మీర్ లో మొదలయ్యే కథ.. కర్నూలుకు రాక తప్పలేదు. సంక్రాంతి సినిమా సరిలేరు నీకెవ్వరు కు ప్రత్యేకంగా కర్నూలు నేపథ్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
కర్నూలుకూ ఆ కథకూ ప్రత్యేకంగా సంబంధం ఏమీ లేదు. విలన్ ఏదో ఒక వూర్లో ఉండాలి కాబట్టి కర్నూలులో ఉంటాడంతే. కేవలం రాయలసీమను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాకు కర్నూలు నేపథ్యాన్ని వాడుకున్నారు. మహేశ్ కు సెంటిమెంట్ గా కొండారెడ్డి బురుజును సెట్లో కూడా బోలెడన్ని సీన్లను చిత్రీకరించుకున్నారు. రాయలసీమ లేకపోతే తెలుగు సినిమా ఏమైపోయేదో పాపం అనిపిస్తుంది.
ఆంధ్రా హీరోలు అలా రాయలసీమ పేరు చెప్పుకు బతుకీడుస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చేత రాయలసీమ మాండలికాన్ని పలికించారు. ఇది వరకూ అనేక సినిమాల్లో ప్రకాష్ రాజ్ రాయలసీమ మాండలికం లో విలనిజాన్ని పలికించాడు. అయితే ఈ సారి కొంచెం భిన్నంగా ట్రై చేశారు.
గతంలో ఏదో ఒకటీ రెండు పదాలను మాత్రమే రాయలసీమ స్టైల్లో పలికించి, మిగతా డైలాగులను రొటీన్ గా మార్చేసేవాళ్లు. అయితే సరిలేరులో మాత్రం ప్రకాష్ రాజ్ పాత్ర ఆద్యంతం సీమ స్టైల్లోనే మాట్లాడుతుంది. అందులో కొంత అనుకరణ కనిపిస్తుంది. ఆ అనుకరణ మరెవరినో కాదు.. టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని అనుకరించడం గమనార్హం.
సినిమా కర్నూలు వేదికగా సాగినా, ఆ మాండలికం మాత్రం.. కడప స్టైల్లో ఉంటుంది. కడప- తాడిపత్రి మధ్య ప్రాంతంలో ప్రజలు ఎలా మాట్లాడతారో.. అదే స్టైల్లో సరిలేరు నీకెవ్వరు సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర మాట్లాడుతుంది. ఆ మాండలికంలోనే జేసీ మాట్లాడతారు. గొంతును టోన్ డౌన్ చేసి.. ప్రకాష్ రాజ్ మాట్లాడే యాస, భాష అంతా దివాకర్ రెడ్డినే గుర్తు చేస్తుంది. సినిమాలో ప్రకాష్ రాజ్ ది నెగిటివ్ రోల్ అని వేరే చెప్పనక్కర్లేదు. అయినా సరిలేరు రూపకర్తలు దివాకర్ రెడ్డి టోన్ ను విలన్ కోసం వాడేసినట్టుగా ఉన్నారు.