తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాననడం బురదజల్లే ప్రయత్నేనని వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని ఆనం సవాల్ విసిరారు. ఆనం ఓటును పరిగణలోకి తీసుకోమని సజ్జల చెప్పిన విషయం గుర్తు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను క్రాస్ ఓటు వేశానని చెప్పడానికి సజ్జల ఎవ్వడాని ప్రశ్నించారు. విలేఖరి స్థాయి నుండి సజ్జల వందల కోట్లు ఎలా సంపాదించారో తనకు తెలుసన్నారు. నన్ను తప్పించడానికి నాలుగు నెలల క్రితమే కుట్ర చేశారని.. తన నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ ని నియమించిన రోజు నుంచే పార్టీకి దూరంగా ఉన్నానన్నారు.
‘‘మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తారా? నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఎన్నికల కమిషన్‌ను చెప్పమనండి. లేదంటే ఆధారాలుంటే బయట పెట్టండి. నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు? రాజ్యాంగేతర శక్తితో పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని విమర్శించారు. వ్యవస్థలు దిగజారుతున్నాయని సీఎంకు ఎప్పుడో చెప్పానని.. ప్రభుత్వంలో దోపిడీ జరుగుతోందని సీఎంకు చెప్పినా పట్టించుకోలేదన్నారు.
రాజకీయ భవిష్యత్ పై కార్యకర్తలు, సన్నిహితుల సలహాలతో ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు.