వన్ సైడ్ లవ్ పై పవన్ స్పందిస్తారా..?

చంద్రబాబు తన లవ్ ఎక్స్ ప్రెస్ చేశారు. తనకు జనసేనతో కలసి వెళ్లాలనే ఆలోచన ఉంది కానీ, జనసేన నుంచి ప్రతిస్పందన లేదని, పవన్ కల్యాణ్ ఇంకా తన లవ్ యాక్సెప్ట్ చేయలేదని నర్మగర్భంగా…

చంద్రబాబు తన లవ్ ఎక్స్ ప్రెస్ చేశారు. తనకు జనసేనతో కలసి వెళ్లాలనే ఆలోచన ఉంది కానీ, జనసేన నుంచి ప్రతిస్పందన లేదని, పవన్ కల్యాణ్ ఇంకా తన లవ్ యాక్సెప్ట్ చేయలేదని నర్మగర్భంగా మాట్లాడారు. అక్కడితో చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టారు. మరి దీనిపై పవన్ స్పందించాలి కదా. 

కనీసం ఐ లవ్యూ అని చెబితే ఎస్ అయినా చెప్పాలి, నో అయినా చెప్పాలి. లేదా ప్రస్తుతం బీజేపీతో నేను లవ్ లో ఉన్నాను, నా లవర్ ని అడిగి చెబుతాను అని అయినా చెప్పాలి. కానీ ఏదీ లేకుండా పవన్ మౌనవ్రతం పాటిస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్ ముందుకొచ్చి ఐ లవ్యూ చెబితే హీరో ఎలా బిల్డప్ ఇస్తారో, ప్రస్తుతం పవన్ కూడా ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నారు.

జనసేన మీటింగ్ లో అవకాశం లేదు..

జనసేన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు జరగాల్సి ఉన్నా.. దాన్ని వాయిదా వేశారు పవన్ కల్యాణ్. కొవిడ్ కారణంగా సమావేశం పోస్ట్ పోన్ చేసినట్టు చెప్పారు. ఈ దశలో ఇలాంటి విషయాలపై క్లారిటీ వస్తుందనుకుంటే పవన్ వ్యూహాత్మకంగా తప్పుకున్నారు.

అటు బీజేపీలో కొంతమంది నేతలు మాత్రం చంద్రబాబు వ్యూహాన్ని తిప్పికొట్టారు. వైసీపీ నుంచి కూడా బాబు చావు తెలివితేటలపై విమర్శలు వినిపించాయి. కానీ అసలు హీరో, ఈ కథకు మూల పురుషుడు పవన్ మాత్రం స్పందించకపోవడం విశేషం.

ఇప్పటికిప్పుడు స్పందించకపోయినా బీజేపీ, టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికలనాటికి కూటమి కట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ కూటమికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా బీజం పడుతుందో తేలాలి. ప్రస్తుతానికయితే బీజేపీ-జనసేన కలిసే ఉన్నాయి. జస్ట్ టీడీపీ వెళ్లి వారితో కలిస్తే సరిపోతుంది. జనసేనకు మనసులో ఇష్టం ఉన్నా కూడా ఈ త్రికోణం ప్రేమకు బీజేపీ ఇష్టపడటం లేదు.

అందుకే రెండు పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు వన్ సైడ్ లవ్ స్టోరీ మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్ మౌనం అర్థాంగీకారమా, లేక అందరి ముందు ప్రపోజ్ చేయడం ఆయనకు ఇష్టం లేదా.. త్వరలో తేలిపోతుంది.