దేశ రాజకీయంలో సెమిఫైనల్ అనదగ్గ యూపీ, పంజాబ్, ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి పదిన వెల్లడి కానున్నాయి. సరిగ్గా మరో రెండు నెలల్లో దేశ రాజకీయ ముఖ చిత్రంపై కొంత క్లారిటీ లభిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై ప్రజాస్పందన ఎలా ఉందనే అంశంపై ఇవన్నీ సెమిఫైనల్స్ లాంటి ఎన్నికలు.
బీజేపీకి బిచాణా లేని పంజాబ్ లో, బీజేపీనే సర్వం అయిన యూపీ… ఎన్నికల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. యూపీలో మళ్లీ గత టర్మ్ స్థాయి విజయం సాధిస్తే.. బీజేపీ ఆట సాగుతున్నట్టే! యూపీపై ఆశల్లేని కాంగ్రెస్ కనీసం పంజాబ్ లో ఉనికిని నిలబెట్టుకుంటే తను కూడా ఆటలో ఉన్నట్టే!
80 లోక్ సభ స్థానాలున్న యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికి ఏడాది నుంచి బీజేపీ కసరత్తు సాగిస్తూ ఉంది. సెకెండ్ వేవ్ కరోనా సమయంలోనే.. బీజేపీ నేతలు యూపీలో మళ్లీ నెగ్గడానికి ఏం చేయాలనే అంశంపై రకరకాలుగా కసరత్తును సాగిస్తూ ఉన్నారు.
ఇక ప్రధానమంత్రి మోడీ అయితే.. గత కొన్ని నెలలుగా.. యూపీ చుట్టూరానే తిరుగుతున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పూజలు.. ఇలా దేన్నైనా యూపీలోనే అన్నట్టుగా మోడీ యూపీని ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మోడీకి తోడు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పీఠాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రమైన రాజకీయ కార్యకలాపాలే సాగిస్తూ ఉన్నారు.
కాంగ్రెస్ సోది లో లేకుండా పోయింది. ఈ సారి సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దాదాపు ఒంటరి పోరు చేస్తూ ఉన్నారు. చిన్నా చితక పార్టీలతో పొత్తు ఉన్నా.. కాంగ్రెస్, బీఎస్పీలను పక్కన పెట్టి అఖిలేష్ సోలోగా తేల్చుకుంటున్నాడు. మాయవతి పార్టీ ఉందా.. లేదా… అనే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది.
ఏతావాతా.. యూపీలో యోగి ప్లస్ మోదీకి సోలోగా అఖిలేష్ యాదవ్ కి మధ్య పోరు సాగుతోంది. 2014 నుంచి ఢిల్లీ స్థాయిలో బీజేపీ తిరుగులేని శక్తిగా వ్యవహరించడానికి అవకాశం ఇస్తున్న ఉత్తరాది బెల్ట్, హిందీ బెల్ట్… వచ్చేసారి బీజేపీకి ఎంత బలాన్ని ఇస్తుందో యూపీ ఎన్నికలతో సూఛాయగా స్పష్టత రానే వస్తుంది. దానికి మరో రెండు నెలల సమయం పట్టనుంది.