భారతీయ బాక్సాఫీస్ హిస్టరీలో ఇన్నాళ్లూ అతి పెద్ద ఫ్లాప్ లుగా.. షారూక్ ఖాన్ సినిమా జీరో, రణ్ భీర్ కపూర్ సినిమా బాంబే వెల్వెట్ వంటివి ఉండేవి. కనీసం ఎనభై కోట్ల రూపాయల స్థాయి నష్టాలతో ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ పరాజయాన్ని పొందిన సినిమాలుగా నిలిచాయి.
ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించింది మరో బాలీవుడ్ సినిమా. రెండు వందల అరవై కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన 83 మూవీ, రమారమీ ఎనభై కోట్ల రూపాయల వరకూ నష్టపోతోందనేది బాక్సాఫీస్ సమాచారం. ఈ సినిమాకు అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో వచ్చిన కలెక్షన్లన్నింటిని కలిపి కూడినా.. నష్టం ఎనభై కోట్ల రూపాయల పై మాటే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఈ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలోనే అతి భారీ ఫెయిల్యూర్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. భారతీయ స్పోర్ట్స్ హిస్టరీలోనే అద్భుతం అని చెప్పుకోదగిన విజయంపై రూపొందిన సినిమా అతి భారీ ఫ్లాప్ గా నిలవడం గమనార్హం.
భారీ స్టార్ కాస్ట్ తో రూపొందిన ఈ సినిమాకు బడ్జెట్ భారీగా అయ్యిందని, ఏకంగా రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చినా, క్రిటిక్స్ కూడా ప్రశంసించినా.. ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది. పాజిటివ్ రివ్యూలు, రేటింగులు కూడా ఈ సినిమాను కాపాడలేకపోవడం గమనార్హం!
కోవిడ్ పరిస్థితులు కూడా ఈ సినిమా కలెక్షన్లు వెనకబడటానికి ఒక కారణం కావొచ్చు. అయినప్పటికీ.. 80 కోట్ల రూపాయల నష్టం అంటే, పరిస్థితులు సవ్యంగా ఉండినా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దశకు వచ్చేది కాదేమో!